"నా ప్రతి సినిమా విభిన్నంగా ఉండాలి. చేసే ప్రతి పాత్ర నటుడిగా నాకు సవాల్ విసరాలి. ఎప్పటికీ అలా వైవిధ్యభరితమైన కథలతోనే ప్రయాణం చేస్తా" అన్నారు నటుడు సత్యదేవ్. విలక్షణమైన నటనతో కథానాయకుడిగా.. సహాయ నటుడిగా విభిన్న పాత్రలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ఆయన. గతేడాది 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' చిత్రంతో విజయాన్ని అందుకొన్నారు. ప్రస్తుతం 'గుర్తుందా శీతాకాలం', 'గాడ్సే', 'తిమ్మరుసు' లాంటి అరడజనుకు పైగా చిత్రాలతో సెట్స్‌పై బిజీగా గడుపుతున్నారు. ఆదివారం సత్యదేవ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా 'ఈనాడు సినిమా' ఆయన్ని పలకరించగా పలు ఆసక్తికర కబుర్లు పంచుకున్నారు.
ఈసారి పుట్టినరోజు ప్రత్యేకతలేంటి? కొత్త లక్ష్యాలేమైనా నిర్దేశించుకున్నారా?
"పుట్టినరోజును ఓ ప్రత్యేక వేడుకలా జరుపుకోవాలని నేనెప్పుడూ అనుకోను. కెరీర్ పరంగా గతేడాదికి.. ఈ ఏడాదికి మరింత పురోగతి సాధించాలనుకుంటా. నటుడిగా నన్ను నేను మరింత మెరుగు పరుచుకోవాలనుకుంటా. మూడేళ్లుగా ప్రతి బర్త్‌డేకి నా లక్ష్యాలు ఒకొక్కటిగా సాధించుకుంటూ వెళ్తున్నా. హీరోగా ఓ భారీ విజయాన్ని అందుకోవాలనుకున్నా. 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య'తో నెరవేరింది. బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాలనుకున్నా.. ఇప్పుడు 'రామ్ సేతు' సినిమాతో అది తీరనుంది. ఇలా ప్రతి పుట్టినరోజు నాటికి నేననుకున్న లక్ష్యాల్లో ఏదొకటి పూర్తి చేసుకుంటూ వెళ్తున్నా. ప్రస్తుతం ఐదు చిత్రాలు లైన్‌లో ఉన్నాయి. ఆదివారం మరి కొన్ని కొత్త ప్రకటనలు వెలువడనున్నాయి".
ఈ మధ్య నానితో కలిసి 'దారే లేదు' పాట చేశారు. ఎలా అనిపించింది?
నాని అన్న అంటే నాకు చాలా ఇష్టం. తనతో కలిసి పనిచేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. ఓ రోజు ఆయనే ఫోన్ చేసి 'ఫ్రంట్ లైన్ వర్కర్స్ కోసం ఓ పాట చేయాలనుకుంటున్నా. నువ్వు చేస్తే బాగుంటుంద'న్నారు. నేను ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే చేస్తా అన్నా. ఎందుకంటే ఆయన అడుగుతున్నారంటే కచ్చితంగా అందులో ఏదో విషయం ఉంటుందని తెలుసు. నాకూ ఫ్రంట్ లైన్ వర్కర్స్ కోసం ఏదోకటి చేయాలని ఎప్పటి నుంచో మనసులో ఉంది. ఇవన్నీ 'దారే లేదు' పాట రూపంలో నెరవేరినందుకు సంతోషంగా అనిపించింది. మా పాటకు ప్రేక్షకుల నుంచి దక్కిన ఆదరణ చూశాక మరింత సంతృప్తిగా అనిపించింది.
ఏ నటుడైనా హీరో ఇమేజ్ వచ్చాక.. అలాగే కొనసాగాలి అనుకుంటారు. మీరిప్పటికీ అన్ని రకాల పాత్రలతో అలరించేందుకు ఇష్టపడుతున్నారు. ఎందుకిలా?
నిజానికి నా తొలి ప్రాధాన్యమెప్పుడూ లీడ్ రోల్స్‌పైనే ఉంటుంది. అయితే కొన్నిసార్లు కథలతో పాటు కొన్ని పాత్రలు మనలో ఓ తెలియని ఆసక్తి కలిగిస్తుంటాయి. ఒకవేళ అలాంటి విభిన్నమైన పాత్ర ఏదైనా నా దగ్గరకి వస్తే.. కచ్చితంగా చేయాలనే అనుకుంటా. ఓ ఇమేజ్ చట్రంలో బందీ అవ్వాలనుకోను. నేను ఏం చేసినా కొత్తగా ఉండాలనుకుంటా. చేసే ప్రతి సినిమా మునుపటి చిత్రానికి భిన్నంగా ఉండాలనుకుంటా.