శర్వానంద్, ప్రియాంక అరుళ్ మోహన్ జంటగా తెరకెక్కిన సినిమా 'శ్రీకారం'. ఈ మూవీ నేడు(గురువారం) విడుదలైంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం ఎలా ఉందో ఈటీవీ భారత్ సమీక్ష ద్వారా తెలుసుకుందాం.
ఒక వైద్యుడు తన కొడుకుని తనలా వైద్యుడిని చేయాలనుకుంటాడు.. ఒక హీరో తన కొడుకు కూడా సినిమాల్లోకే రావాలనుకుంటాడు. కానీ, రైతు మాత్రం తన కొడుకు రైతు కావాలనుకోడు. తరాలుగా సాగుతున్న వ్యవసాయం పరిస్థితి నేడు అలా మారిపోయింది. వ్యవసాయం కొత్త పుంతలు తొక్కాలని చెబుతూ రూపొందిన చిత్రమే.. 'శ్రీకారం'. బలమైన ప్రచారంతో విడుదలకి ముందే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిందీ చిత్రం. మరి సినిమా ఎలా ఉంది? యువ రైతుగా శర్వా ఏ మేరకు మెప్పించాడు? కొత్త దర్శకుడు కిషోర్ టేకింగ్ ఎలా ఉంది? తదితర విషయాలు ఈటీవీ బారత్ సమీక్ష ద్వారా తెలుసుకుందాం.
కథేంటంటే: కార్తీక్ (శర్వానంద్) ఓ రైతు కుటుంబానికి చెందిన యువకుడు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగంలో రాణిస్తాడు. తండ్రి కేశవులు(రావు రమేష్) చేసిన అప్పుల్ని కూడా కడతాడు. అందమైన అమ్మాయి చైత్ర (ప్రియాంక అరుళ్ మోహన్) మనసును కూడా దోచేస్తాడు. రెడ్ కార్పెట్‌పై తిరిగే స్థాయిలో ఉన్న కార్తీక్ ఉన్నట్టుండి ఉద్యోగం మానేయాలని నిర్ణయించుకుంటాడు. ఊరెళ్లి వ్యవసాయం చేస్తానంటూ పట్నం నుంచి పల్లెటూరికి వచ్చేస్తాడు. ఇంకోపక్కేమో కార్తీక్ తండ్రి కేశవులు తన కొడుకు అమెరికా వెళ్లబోతున్నాడని గొప్పగా చెప్పుకొంటుంటాడు. మరి కార్తీక్ ఊరికి తిరిగొచ్చాక కేశవులు ఎలా స్పందించాడు? మనసిచ్చిన అమ్మాయి ఏం అంటుంది? ఇంతకీ అతను వ్యవసాయం చేయాలని సంకల్పించుకోవడం వెనక కారణమేమిటి? మరి వ్యవసాయంలో ఫలితాలు అందుకున్నాడా? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
శ్రీకారం
ఎలా ఉందంటే: వ్యవసాయంలో రాణిస్తున్న విద్యావంతుల స్ఫూర్తితో అల్లుకున్న కథ ఇది. నగరాల్లో మంచి మంచి కొలువుల్లో కొనసాగుతూ ఐదంకెల జీతాలు అందుకుంటున్నా అందులో సంతృప్తి లేక, సొంతూళ్లకి తిరిగొచ్చి వ్యవసాయంలో రాణిస్తున్న వాళ్లు చాలా మంది ఉన్నారు. వాళ్ల విజయగాథల్ని తరచూ వింటుంటాం. ఇది కూడా అలాంటి ఓ కథే. వ్యవసాయం నేపథ్యంలో తరచూ సినిమాలొస్తుంటాయి. వ్యవసాయం కథావస్తువు అనేసరికి సందేశాలు ఉంటాయేమో అనే సందేహాలే ఎక్కువ. ఇదివరకు వచ్చిన సినిమాల ప్రభావం అది. కానీ నవతరం దర్శకులు సందేశాన్ని కూడా వాణిజ్యాంశాల మాటున చెబుతూ ఫలితాల్ని సొంతం చేసుకుంటున్నారు. 'శ్రీకారం' కూడా అలాంటి ప్రయత్నమే. తినేవాళ్లు నెత్తిమీద జుట్టంత సంఖ్యలో ఉంటే.. పండించే వాళ్లు మూతిమీద మీసం అంత కనిపిస్తున్న ఈ పరిస్థితుల్లో వ్యవసాయదారుల జీవితాలు ఎలా మారిపోయాయి? కాడిని వదిలేసి పట్టణాలకి వెళ్లి ఎలాంటి పాట్లు పడుతున్నారనే విషయాల్ని కళ్లకి కట్టినట్టుగా చూపించారు దర్శకుడు. అయితే హీరో వ్యవసాయం చేయాలని సంకల్పించుకోవడం, రాత్రికి రాత్రే లాభాలబాట పట్టించడం వంటి సన్నివేశాలు మరీ సినిమాటిక్‌గా అనిపిస్తాయి. పల్లెల్లో వ్యవసాయ జీవితాల విధ్వంసాన్ని చూపించినంత సహజంగా.. వ్యవసాయం చేయడం వెనక సాధక బాధకాల్ని చూపించలేకపోయారు. ఒకట్రెండు పాటలు, సన్నివేశాలతోనే.. మోడువారిన పల్లెలు పచ్చగా మారిపోతుంటాయి.
సామాజిక మాధ్యమాల్లో హీరో పిలుపు ఇవ్వగానే రైతు పండించిన పంటలంతా అమ్ముడైపోతాయి. ఇవన్నీ వాస్తవానికి దూరంగా అనిపిస్తాయి. అసలు కథలోకి వెళ్లడానికి కాస్త సమయం తీసుకున్నాడు దర్శకుడు. పట్నంలో నరేష్ పాత్ర కనిపించడం దగ్గర్నుంచి అసలు కథ మొదలవుతుంది. హీరో పొలం బాట పట్టడం, ఉమ్మడి వ్యవసాయం అంటూ ఊరంతటినీ కలుపుకొని రంగంలోకి దిగడం దగ్గర్నుంచి కథలో వేగం అందుకుంటుంది. వడ్డీలకి డబ్బులిస్తూ పొలాల్ని సొంతం చేసుకునే ఏకాంబరం (సాయికుమార్) ఊరి జనాల ఐక్యతని దెబ్బ తీసేందుకు ప్రయత్నించడం, కథానాయకుడికీ తన తండ్రికీ మధ్య విభేదాలు వచ్చేలా చేయడం వంటివి కథలో ఆసక్తిని రేకెత్తిస్తాయి. హీరోకి సవాళ్లు ఎదురవుతున్నప్పుడే కథలో డ్రామా పండుతుంది. కరోనా రాకతో రైతులకి ఎదురైన సవాళ్లు.. వాటిని హీరో అధిగమంచిన తీరు ఆకట్టుకుంటుంది. కుటుంబ నేపథ్యంలో పండే భావోద్వేగాలు, సత్య పాత్ర నేపథ్యంలో వినోదం చిత్రానికి బలం. పతాక సన్నివేశాలు హత్తుకుంటాయి. రానున్న రోజుల్లో కొత్త ట్రెండ్ అంటే వ్యవసాయమే అని చెప్పిన విధానం బాగుంది. హీరో-హీరోయిన్ల మధ్య ప్రేమ, కెమిస్ట్రీ చిత్రానికి మరో ఆకర్షణగా నిలిచింది. ప్రేక్షకులు సులభంగా కనెక్ట్ అయ్యే అంశాలున్న చిత్రమిది.
శ్రీకారం
ఎవరెలా చేశారంటే: శర్వానంద్ రైతు కుటుంబం నుంచి వచ్చిన యువకుడిగా చక్కగా ఒదిగిపోయాడు. ఆయన పాత్ర చుట్టూనే ఈ కథ నడుస్తుంది. భావోద్వేగాలు పండించడంలోనూ.. గాఢతతో కూడిన పాత్రలో ఒదిగిపోవడంలోనూ ఆయన మరోసారి తన ప్రత్యేకతని చాటి చెప్పారు. రావు రమేష్, సాయికుమార్, నరేష్ బలమైన పాత్రల్లో కనిపిస్తారు. సాయికుమార్ ఏకాంబరంగా వ్యతిరేక ఛాయలున్న పాత్రని చేశారు. సత్య కామెడీ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. కథానాయిక ప్రియాంక అరుళ్ మోహన్ అందంగా కనిపించింది.
శ్రీకారం
సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. యువరాజ్ కెమెరా పనితనం, మిక్కీ జె.మేయర్ సంగీతం, బుర్రా సాయిమాధవ్ సంభాషణలు చిత్రానికి బలం. పాటలు, వాటి చిత్రణ కూడా అర్థవంతంగా, సందర్భోచితంగా సాగుతాయి. రాజీలేని నిర్మాణ తెరపై కనిపిస్తుంది. దర్శకుడు కిషోర్ కథని నిజాయతీగా చెప్పే ప్రయత్నం చేశారు. కమర్షియల్ అంశాల కోసం ఎక్కడా నేలవిడిచి సాము చేయలేదు.
బలాలు
బలహీనతలు
+ కథ, భావోద్వేగాలు
- కొన్ని సన్నివేశాల్లో నాటకీయత
+ శర్వానంద్ నటన
+ సంభాషణలు, సంగీతం
చివరిగా: శ్రీకారం.. ఓ మంచి ప్రయత్నం.
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!