Sarvanand Rashmika Adavallu Meeku Joharlu: నా కెరీర్‌లోనే ఇదొక అత్యుత్తమమైన సినిమాగా నిలిచిపోతుందన్నారు శర్వానంద్. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’. రష్మిక కథానాయిక. తిరుమల కిషోర్ దర్శకత్వం వహించారు. సుధాకర్ చెరుకూరి నిర్మాత. ఈ సినిమా మార్చి 4న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో విడుదలకి ముందస్తు వేడుక జరిగింది. ప్రముఖ దర్శకుడు సుకుమార్, నాయికలు కీర్తిసురేష్, సాయిపల్లవి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సంయుక్తంగా ట్రైలర్‌ని విడుదల చేశారు. ‘నాకు ఆస్కార్ వద్దు... సినిమా ఆడితే చాలు’, ‘మీరేమో పెళ్లి అనే పరీక్షని లాక్‌డౌన్‌లో స్టూడెంట్స్‌లా రాయకుండానే పాస్ అయిపోయి, నాతో మాత్రం రాయిస్తూనే ఉంటారా?’ అనే సంభాషణలు ట్రైలర్‌కి ఆకర్షణగా నిలిచాయి. వేడుకనుద్దేశించి శర్వానంద్ మాట్లాడుతూ ‘‘నాకు బాగా ఇష్టమైన నిర్మాత సుధాకర్ వల్లే ఈ సినిమా చేశా. మంచి సినిమాని ఇచ్చినందుకు కృతజ్ఞతలు. బలమైన కుటుంబ వినోదం ఇందులో చూస్తారు. రష్మికతో కలిసి పనిచేయడం మంచి అనుభవం. దేవిశ్రీప్రసాద్ చాలా మంచి పాటలు ఇచ్చారు’’ అన్నారు.
సాయిపల్లవి మాట్లాడుతూ "నా కుటుంబ వేడుకకి వచ్చినట్టే ఉంది. ‘పడి పడి లేచే మనసు’ చేసినప్పట్నుంచి నిర్మాతలు నా కుటుంబ సభ్యులు అయిపోయారు. శర్వానంద్ ఒక హీరో అయిపోయానని కాకుండా... తను ఇంకా బాగా వినోదం పంచాలని ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటాడు. పుష్ప’తో విజయం అందుకున్న రష్మికకు ఈ సినిమాతో మరో విజయం దక్కాలని ఆశిస్తున్నా" అన్నారు.