Sarvanad Adavallu meeku joharlu movie: "నేను ప్రతి సినిమాకీ ఓ కొత్త కథ చెప్పాలనే అనుకుంటా. నా గత చిత్రాల్లో స్నేహం గురించి చెప్పా. ఓ పరాజితుడి గురించి చెప్పా. అలా ఈ చిత్రంలో ఆడవాళ్లకు సంబంధించిన ఓ కొత్త విషయం చెబుతున్నా. ఇకపైనా ఇదే పంథాలో నడుస్తా" అన్నారు తిరుమల కిషోర్. 'నేను శైలజ', 'ఉన్నది ఒకటే జిందగీ', 'చిత్రలహరి' వంటి విజయవంతమైన చిత్రాలతో ప్రేక్షకుల్ని మెప్పించిన దర్శకుడాయన. ఇప్పుడు 'ఆడవాళ్లు మీకు జోహార్లు'తో అలరించేందుకు సిద్ధమయ్యారు. శర్వానంద్, రష్మిక జంటగా నటించిన చిత్రమిది. ఈనెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే చిత్ర విశేషాలను తెలిపారు తిరుమల కిషోర్.
'ఆడవాళ్లు మీకు జోహార్లు' కథ తొలుత వెంకటేష్‌కు చెప్పినట్లున్నారు కదా?
"లేదు.. ఆ కథ వేరే. ఇది కొత్త స్క్రిప్ట్. టైటిల్ అప్పుడు వెంకటేష్ కోసం అనుకున్నదే. ఇందులో హీరో నేపథ్యమూ ఆ కథలో ఉన్నట్లుగానే ఉంటుంది. ఇంతకు మించి ఆయనకు చెప్పిన కథకు.. ఈ స్క్రిప్ట్‌కు ఏ సంబంధం ఉండదు. దీన్ని తొలుత వినిపించింది శర్వానంద్‌కే. అప్పటికి ఆయన ఇలాంటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చేయాలని ఆలోచనలో ఉన్నారు. కథ చెప్పగానే ‘బాగుంది.. నాకు సరిగ్గా సరిపోయే కథ’ చేద్దామన్నారు".
ఆడవాళ్ల గొప్పతనాన్ని చాటే చిత్రమంటున్నారు. టైటిల్ పాటలో హీరోకి వాళ్లపై ఉన్న ఫ్రస్టేషన్‌ను చూపించారు?
"పదిమంది ఆడవాళ్లు ఉన్న ఇంట్లో ఒక్కడే మగ పిల్లాడు ఉంటే.. వాడిపై అందరికీ ఎంత ప్రేమ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హీరో పాత్ర నేపథ్యం అలాంటిదే. వాళ్ల విపరీతమైన ప్రేమ వల్ల పెళ్లి విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొంటుంటాడు. అందుకే వాడి బాధను అలా పాట రూపంలో చెప్తాడు. అలాగని వాళ్లపై తనకి కోపమని కాదు. వాళ్లందరంటే తనకీ చాలా ప్రేమే. ఆ ఒక్క సందర్భంలోనే అలా ఉంటాడు. మళ్లీ తెల్లారితే అందరి మధ్య అవే ప్రేమానురాగాలు కనిపిస్తాయి. సినిమాలో ఉన్న ప్రతి పాత్రకూ ప్రాధాన్యముంటుంది. ఏ ఒక్క పాత్ర లేకున్నా... తెరపై కథ ముందుకు సాగదు. అలాగే అన్ని పాత్రలున్నా కథలో హీరో ఫోకస్.. హీరోదే. నేను ఈ కథ రాసుకున్నప్పుడే రాధిక, ఖుష్బూ, ఊర్వశిలను తీసుకోవాలనుకున్నాం. ఎందుకంటే ఇలాంటి కథలకు అలాంటి అనుభవమున్న నటీమణులైతేనే న్యాయం చేయగలుగుతారు".