ఓ సినిమా జయాపజయాలు దర్శకత్వంపై ఆధారపడి ఉంటాయి. అందుకే దర్శకుడిని కెప్టెన్ ఆఫ్ ది షిప్‌గా అభివర్ణిస్తుంటారు. తాము అనుకున్న విధంగా సినిమాని తెరకెక్కించాలనే ఉద్దేశంలో దర్శకులు ఎన్నో ఇబ్బందులు, మరెన్నో ఒడుదొడుకులను చిరునవ్వుతో స్వీకరిస్తుంటారు. ఎండా, వానా ఇలా ఎలాంటి పరిస్థితుల్లోనైనా వాళ్లు పడే కష్టం అంతాఇంతా కాదు. అలా.. దర్శకులు పడే కష్టానికి సూపర్‌స్టార్ మూవీ షూటింగ్ ఫొటోనే నిదర్శనం అనుకుంటున్నారు నెటిజన్లు.
గొడుగు కింద హీరో.. ఎండలో నేలపై దర్శకుడు! - సర్కారువారి పాట షూటింగ్ పరశురామ్
సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా 'సర్కారు వారి పాట' అనే చిత్రం తెరకెక్కుతోంది. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన ఓ ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది.
సూపర్‌స్టార్ మహేశ్‌బాబు కథానాయకుడిగా తెరకెక్కుతోన్న చిత్రం 'సర్కారువారి పాట'. 'గీత గోవిందం' ఫేమ్ పరశురామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కీర్తిసురేశ్ కథానాయిక. ఇటీవల ఈ సినిమా షూటింగ్ దుబాయ్‌లో ప్రారంభమైంది. ప్రస్తుతం ఇక్కడ మహేశ్‌కు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
తాజాగా ఈ సినిమా షూటింగ్ లొకేషన్ నుంచి ఓ ఫొటో లీకైంది. ఇందులో మహేశ్‌బాబు తన అసిస్టెంట్స్‌తో ఉండగా.. ఓ వ్యక్తి మండుటెండలో నేలపై కూర్చొని ఏదో రాసుకుంటున్నట్లు కనిపిస్తోంది. అయితే, ఆ వ్యక్తి దర్శకుడు పరశురామేనని అందరూ చెప్పుకుంటున్నారు. దీంతో ఈ ఫొటో కాస్త నెట్టింట్లో వైరల్‌గా మారింది. వృత్తిపట్ల పరశురామ్‌కు ఉన్న నిబద్ధతను చూసి అందరూ ఆయన్ని మెచ్చుకుంటున్నారు.