సంక్రాంతికి రాబోతున్న తెలుగు చిత్రాల విడుదల తేదీలపై ఉత్కంఠ వీడింది. గతంలో ప్రకటించినట్లే జనవరి 11న 'సరిలేరు నీకెవ్వరు', జనవరి 12న 'అల వైకుంఠపురములో..' సినిమాలు విడుదల కాబోతున్నాయి. ఈ తేదీలను చిత్రబృందం ముందే ప్రకటించినప్పటికీ.. సెన్సార్ సమయంలో పోస్టర్లపై విడుదల తేదీలు ఇవ్వలేదు. ఈ కారణం వల్ల ప్రేక్షకులు, అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ సమస్యకు పరిష్కారం కోసం శనివారం తెలుగు చిత్ర నిర్మాతల సంఘం భేటీ అయింది. అనంతరం రెండు మూవీల విడుదలపై క్లారిటీ ఇచ్చాడు నిర్మాత దిల్‌రాజు.
" రెండు మూడు రోజుల నుంచి సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో.. గురించి సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. ఇవాళ నిర్మాతలతో మాట్లాడి, ఒప్పించాం. కారణాలు ఏమైనా కావొచ్చు.. ఓ సినిమా విడుదలవుతున్నప్పుడు అందరూ సంతోషంగా ఉండాలి, ఎవరూ నష్టపోకూడదు. ఆ ఉద్దేశంతో ఈ సంఘం ఏర్పాటు చేశాం. ముందుగా అనుకున్నట్లే జనవరి 11న 'సరిలేరు నీకెవ్వరు', జనవరి 12న 'అల వైకుంఠపురములో'.. వచ్చేలా.. రెండు సినిమాల హీరోలు, నిర్మాతల్ని ఒప్పించాం. ఇలాంటి చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు మా సంఘం ద్వారా పరిష్కరించే ప్రయత్నం చేస్తాం. రెండు పెద్ద సినిమాలు ఒకేరోజు వస్తే ఇబ్బందులు ఏర్పడతాయి. మాపై నమ్మకం ఉంచిన వారికి ధన్యవాదాలు"