నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన 'లవ్స్టోరీ' సినిమాలోని 'సారంగదరియా' పాట వివాదంపై ఆ చిత్ర దర్శకుడు శేఖర్ కమ్ముల స్పందించారు. ఈ పాట సేకరించి పాడిన కోమలితోనే ఆడియో వేడుకలో పాట పాడించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
సారంగదరియా పాట విషయంలో సుద్దాల అశోక్ తేజ, కోమలి మధ్య కొన్నిరోజులుగా వివాదం నడుస్తోంది. 'లవ్స్టోరీ' చిత్ర దర్శకులు తనకు అన్యాయం చేశారని కోమలి ఆరోపించింది. చిత్ర నిర్మాణాంతర కార్యక్రమాల వల్ల ఈ వివాదం తన దృష్టికి రాలేదని ఫేస్బుక్ ద్వారా పేర్కొన్నారు దర్శకుడు శేఖర్ కమ్ముల. సారంగదరియా పాటను సినిమాలో కోమలితోనే పాడిద్దామని సుద్దాలగారు ముందే చెప్పారని, ఆమె వ్యక్తిగత కారణాల వల్ల పాడటానికి రాలేదని వెల్లడించారు.