RRR postponed: గతేడాది సంక్రాంతికి వచ్చిన తెలుగు సినిమాలేవో గుర్తున్నాయా? కచ్చితంగా మీకు గుర్తుండకపోవచ్చు. ఎందుకంటే కరోనా, మన జీవితాల్లోకి వచ్చిన తర్వాత ఏ రోజు ఏం జరుగుతుందో తెలియడం లేదు. ఇది సినిమాలకూ వర్తిస్తుంది. ఎందుకంటే మొన్నమొన్నటి వరకు సంక్రాంతికి కచ్చితంగా వస్తుందనుకున్న 'ఆర్ఆర్ఆర్'.. మళ్లీ వాయిదా పడింది.
Radhe shyam movie: మరోవైపు ప్రభాస్ 'రాధేశ్యామ్' పక్కా వస్తుందని చిత్రబృందం ధీమాగా ఉన్నప్పటికీ.. బయట పరిస్థితులు రోజురోజుకు జటిలంగా మారుతున్నాయి. పలు రాష్ట్రాల్లో థియేటర్లు మూసివేత, కొన్ని రాష్ట్రాల్లోని థియేటర్లలో 50 శాతం ప్రేక్షకులకు మాత్రమే అనుమతి.. ఇలా పలు కారణాలు సినిమా విడుదలపై అభిమానులకు సందేహాలు కలిగిస్తున్నాయి.
అయితే ఈసారి సంక్రాంతికి సినిమాలే రావా? ఏం చూడలేమా? అని అనుకుంటున్న తెలుగు సినీ ప్రేక్షకుడిని అలరించేందుకు వరుసపెట్టి చిన్నాపెద్దా చిత్రాలు సిద్ధమవుతున్నాయి. ఇవి 7-8 వరకు ఉన్నాయి. ఇంతకీ వీటి సంగతేంటి? ఆ సినిమాలేంటి?
'బంగార్రాజు' ధీమా
Bangarraju movie: ఈ సంక్రాంతికి 'బంగార్రాజు' వస్తుందని సోషల్ మీడియాలో గాసిప్స్ వచ్చినప్పుడు.. 'ఆర్ఆర్ఆర్', 'భీమ్లా నాయక్', 'రాధేశ్యామ్' సినిమాలను తట్టుకుని అది నిలబడగలదా అని అందరూ అనుకున్నారు. కానీ వివిధ కారణాలతో 'ఆర్ఆర్ఆర్', 'భీమ్లా నాయక్' వాయిదా పడ్డాయి. దీంతో 'బంగార్రాజు'కు లైన్ క్లియర్ అయింది.