'ఘాజి', 'అంతరిక్షం' వంటి వైవిధ్యభరిత చిత్రాలతో దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు సంకల్ప్ రెడ్డి. మూడో చిత్రాన్ని బాలీవుడ్‌లో చేయబోతున్నారు. విద్యుత్ జమ్వాల్ కథానాయకుడిగా నటించనున్నారు. ఓ చక్కటి యాక్షన్ కథాంశంతో దీన్ని తెరకెక్కించబోతున్నారు. తాజాగా ఈ చిత్ర విషయమై సంకల్ప్ స్పష్టతనిచ్చారు.
"ఏడాది క్రితమే ఈ ప్రాజెక్టు అనుకున్నాం. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు సంబంధించిన కథాంశంతో కొన్ని వాస్తవిక సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాం. పూర్తి స్క్రిప్ట్ సిద్ధమైపోయింది. షూటింగ్‌కు వెళ్దామనుకుంటున్న సమయంలోనే కరోనా - లాక్‌డౌన్ అడ్డొచ్చాయి. మళ్లీ పరిస్థితులు చక్కబడిన వెంటనే రంగం సిద్ధం చేసుకోవాలి."