డ్రగ్స్ కేసులో అరెస్టయిన నటి సంజనా గల్రానీ.. పరప్పన అగ్రహార కారాగారం లోపలకు వెళ్లేందుకు కొంతసేపు మొండికేశారు. ఆమె వేసుకున్న జామీను అర్జీ విచారణ శుక్రవారానికి వాయిదా పడడం వల్ల, ప్రత్యేక భద్రత మధ్య వైద్యశాలకు తీసుకు వెళ్లి పరీక్షలు చేయించారు. అక్కడి నుంచి నేరుగా కారాగారానికి తోడ్కొని వచ్చారు. వ్యాను దిగేందుకు కొంత సమయం తీసుకున్న ఆమె, నిదానంగా జైలు ప్రధాన ద్వారం వరకు వచ్చారు.
"ఈ గేటు చాలా చిన్నగా ఉంది. పెద్ద గేటు తెరవండి. నేను తల వంచుకుని వెళ్లను" అంటూ లోనికి వెళ్లేందుకు ఆమె మొండికేసింది. ఇలానే వెళ్లవలసి ఉంటుందని అక్కడి సిబ్బంది స్పష్టం చేయడం వల్ల చివరకు ఆమె కారాగారంలోకి వెళ్లింది. కారాగారం వెలుపల భద్రత సిబ్బంది, ఆమెను చూసేందుకు వచ్చిన స్థానికులు తమ చరవాణుల్లో ఆమె ఫొటోలు తీసుకున్నారు.