తెలంగాణ

telangana

ETV Bharat / sitara

నోరు విప్పిన సంజన-రాగిణి.. మిగతా వారి కోసం వేట - కన్నడ చిత్రసీమ డ్రగ్స్ కేసు

విలాసవంత సోపానాలు లేవు. శీతల పవనాలూ కరవు. కటిక నేలను తలపించే చిరు మంచాలపై- చిరుతలాంటి ప్రత్యర్థిని పక్కన పెట్టుకుని నిదురపొమ్మంటే ఎలా? ఆ ఇద్దరిదీ ఒకే ఆలోచన.. ఒకే సమస్య. వెండితెరపై ఓ వెలుగు వెలిగిన తారామణులు.. దోమలతో.. బాధలతో.. కరకు కలవరింతలతో.. ఆ రాత్రి ఇలా.. సాగిపోయింది..

sanjana galrani ragini dwivedi latest news
సంజన-రాగిణి

By

Published : Sep 10, 2020, 9:10 AM IST

Updated : Sep 10, 2020, 9:16 AM IST

మాదకద్రవ్యాల వినియోగం, సరఫరా ఆరోపణలపై కటకటాలపాలైన కన్నడ సినీ తారలు రాగిణి ద్వివేది- సంజనా గల్రానీ విచారణ పతాక స్థాయికి చేరింది. వారిద్దరి వ్యవహారంపై రాష్ట్రమంతా ఉత్కంఠతో దృష్టిపెట్టిన వేళ బెంగళూరు కేంద్ర నేర నియంత్రణ దళం విచారణపైనా ఆసక్తిరేగింది. ఒకరి తరువాత మరొకరు అరెస్టై.. సీసీబీ కస్టడీలో విచారణ ఎదుర్కొంటున్నారు. విచారణలో వెలుగు చూసిన అంశాల ఆధారంగా మరిందరు నేరస్తుల కోసం వేట మొదలైంది. ఆ ఇద్దరినీ వేర్వేరుగా విచారించడం వల్ల పలు ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయని అధికారులు వివరించారు. మహిళా పోలీసు అధికారిణి కాత్యాయణి నేతృత్వంలో సినీ నటి రాగిణి ద్వివేదిని మహిళ సంరక్షణ పునర్వసతి కేంద్రంలో విచారించారు. మరో అధికారిణి అంజు మాల నేతృత్వంలో మరికొందరు కలసి నటి సంజనా గల్రానీపై మడివాళ ఎఫ్‌ఎల్‌సీ కార్యాలయంలో ప్రశ్నల వర్షం కురిపించారు.

సంజనా పలు అంశాలపై నోరువిప్పారని అధికారుల నుంచి అందిన సమాచారం. ఓ మాజీ శాసనసభ్యుడి కుమారుడు, ఇద్దరు నటీమణులు, నలుగురు బుల్లితెర నటులు, ప్రముఖ పారిశ్రామికవేత్తల కుమారుల పేర్లను ఆమె వెల్లడించారు. ఆమె చెప్పిన ప్రకారం మరో పది మందిని విచారించడానికి అవసరమైన సాక్ష్యాల సేకరణ ప్రారంభించారు. నగర శివార్లలోని రిసార్టులలో ఏర్పాటు చేసిన మందు పార్టీల అంశంపై వివరాలు రాబడుతున్నారు. మందు పార్టీల్లోనే మత్తు పదార్థాలను సరఫరా చేస్తున్నారనే కోణంలో దర్యాప్తు సాగిస్తున్నారు. మరోవైపు 26 మంది పేర్లను రాగిణి ద్వివేది బయట పెట్టినట్లు సమాచారం. యలహంక, కమ్మనహళ్లి ప్రాంతాల్లో మందు- విందు పార్టీలను విరేన్‌ఖన్నా, రాహుల్‌ ఏర్పాటు చేస్తున్నారని సమాచారం. అక్కడికీ ప్రముఖులే విచ్చేస్తున్నారని ఆమె వివరించినట్లు తెలిసింది. రాగిణి చెబుతున్న విషయాలు నిజమా? కాదా? అని తేల్చుకోవడానికి పలు రిసార్టుల నిర్వాహకులతో ఆరా తీస్తున్నారు. నగరంలోని ఓ శాసనసభ్యుడి అనుచరుడిగా గుర్తింపు పొందిన షేక్‌ ఫైజల్‌, కేరళ మోడల్ రియాజ్‌ తదితరులూ విందుల్లో పాల్గొన్నట్లు గుర్తించగా.. ప్రస్తుతం ఫైజల్‌ పరారీలో ఉన్నాడు. సరైన సాక్ష్యాధారాలు దొరికితే ఎవరినీ వదిలేది లేదని దర్యాప్తులో పాల్గొన్న ఓ అధికారి వివరించారు.

ఆమె తప్పుచేశారా?

'మందు పార్టీల్లో మత్తు పదార్థాలను వినియోగించిన మాట నిజమేనా?' అనే ప్రశ్న ఎదురైనప్పుడు సంజనా గల్రానీ కంటతడి పెట్టారని పోలీసు వర్గాలు తెలిపాయి. మాదక ద్రవ్యాలను ఎందరో సేవిస్తుంటే నన్నే తప్పు పట్టడమేంటని- నేను కేవలం రుచి చూశానని చెప్పినట్లు తెలిసింది. నాతోపాటు నటించే కొందరు ఇలా మత్తుపదార్థాలు తీసుకోవడం చూశాననీ ఆమె చెప్పుకొచ్చారట. ఆమెను వెంటనే అరెస్టు చేయాలని సంజనా గల్రానీ విచారణ సమయంలో పోలీసులను డిమాండు చేసినట్లు సమాచారం.

సెల్‌ఫోన్‌ ఖాళీ..

సీసీబీ పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉందని ముందుగా ఉహించిన సంజనా.. తన చరవాణిలో ఉన్న సమాచారం, చిత్రాలను పూర్తిగా తొలగించినట్లు అధికారులు గుర్తించారు. ఆ సమాచారాన్ని సేకరించడానికి సాంకేతిక నిపుణుల సహాయం తీసుకుంటున్నారు. సదాశివనగరలో ఓ యోగా కేంద్రాన్ని సంజనా నిర్వహిస్తున్నారు. ఇందిరానగరలో ఆమె నివాసం. ఖరీదైన బీఎండబ్ల్యూ కార్లలోనే తిరుగుతారు. ఆమె ఐదు సినిమాల్లో కథానాయిక మాత్రమే. కన్నడ, తెలుగు, తమిళ, మళయాళంలో 48 సినిమాల్లో చిన్న పాత్రల్లోనే నటించారు. అతి తక్కువ సమయంలో రూ.15 కోట్లు ఎలా సంపాదించారు? స్నేహితుడు రాహుల్‌ కలిసి ఏ వ్యాపారం చేస్తున్నారు? అనే ప్రశ్నలనూ అధికారులు సంధించారు.

ఒకే గదిలో.. అటొగరు.. ఇటొగరు..

మాదకద్రవ్యాల కేసులో అరెస్టైన రాగిణి ద్వివేది, సంజనా గల్రానీ మడివాళలోని మహిళ సంరక్షణ పునర్వసతి కేంద్రంలోని ఒకే గదిలో మంగళవారం రాత్రంతా గడిపారు. ఇద్దరూ మాట్లాడుకోలేదు. ఎవరికివారే ఎడమొహ..పెడమొహంగా ఉన్నారు. ఒకరినొకరు కనీసం చూసుకోలేదు. ఆ గదిలోని ఐదు పడకల్లో మొదటి.. చివరి పడకలను ఆ ఇద్దరికీ కేటాయించారు. మధ్యలో ఓ పడకను మహిళా కానిస్టేబుల్‌కు కేటాయించారు. విద్యుత్తు దీపం ఆర్పే విషయంలో ఇద్దరూ వాగ్వాదానికి దిగారని సమాచారం. 'నాకు భోజనం వద్దు' అంటూ సంజనా రాత్రంతా ఏడుస్తూ కూర్చున్నట్లు తెలిసింది. కేపీఎల్‌ క్రికెట్‌ మ్యాచ్‌ సందర్భంగా ఈ ఇద్దరి మధ్య మొదలైన అభిప్రాయభేదాలు లెక్కలేనన్ని. నాటి నుంచి ఇద్దరి మధ్య మాటలు లేకపోవడం వరకు వెళ్లింది.

Last Updated : Sep 10, 2020, 9:16 AM IST

ABOUT THE AUTHOR

...view details