డ్రగ్స్ వ్యవహారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నటి రాగిణి ద్వివేది సహా మరో నలుగురు నిందితులకు.. 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీని విధంచింది బెంగళూరు ఏసీఎంఎం కోర్టు. కన్నడ చిత్ర పరిశ్రమలో మాదక ద్రవ్యాల దందా సాగుతోందన్న సమాచారంతో ఇటీవలే సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్(సీసీబీ) రాగిణి నివాసంలో సోదాలు నిర్వహించి అరెస్టు చేసింది. ఆమెతో పాటు, నటి సంజన గల్రానీ, మరో ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు అధికారులు.
సీసీబీ అధికారులు దర్యాప్తు జరిపిన అనంతరం.. సోమవారం రాగిణిని కోర్టులో హాజరుపరిచారు. ఈ క్రమంలోనే ఆమెను 14 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీలో ఉంచాలని న్యాయస్థానం ఆదేశించింది.
బయట ప్రపంచంలో విలాసవంతమైన జీవితం గడిపే రాగిణి.. ఇప్పుడు సాధారణ ఖైదీగా జైలు జీవితం గడపాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆమెకు కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు. అనంతరం 14 రోజుల పాటు క్వారంటైన్లో ఉంచి.. సాధారణ మహిళా ఖైదీల గదికి తరలించనున్నారు. బెయిల్ పొందే వరకు రాగిణి జైలులోనే గడపాల్సి ఉంటుంది. అయితే, మాదక ద్రవ్యాల కేసులో ఇప్పటికే సీసీబీ అనేక బలమైన సాక్ష్యాలను సేకరించింది. ఈ క్రమంలోనే ఆమె జైలు నుంచి బయటకు రావడం కష్టంగానే కనిపిస్తోంది.
రాగిణికి వసతి కల్పించే బ్లాక్ వద్ద భద్రతను పెంచారు అధికారులు. నటిని చూసేందుకు జనం గుమిగూడకుండా ఉండేందుకు జైల్లోకి ప్రవేశించడంపైనా పరిమితులు విధించనున్నట్లు సమాచారం.
డ్రగ్స్ రాకెట్‌తో సంబంధం కలిగిన నేపథ్యంలో అరెస్టైన మరో నటి సంజన.. మరో మూడు రోజులు పోలీసుల కస్టడీలోనే ఉండనుంది.