మాదక ద్రవ్యాల వినియోగం, విక్రయం ఆరోపణలు ఎదుర్కొంటున్న కన్నడ హీరోయిన్లు సంజన గల్రానీ, రాగిణి ద్వివేదిల విచారణను మడివాళ సమీపంలోని ఫోరెన్సిక్ ప్రయోగశాలలో ఆదివారం రాత్రి వరకు మూడు విడతల్లో కొనసాగించారు. సహకరించకపోతే మరో పది రోజులు నిర్బంధం (కస్టడీ)లోకి తీసుకుంటామని సీసీబీ అధికారిణి అంజుమాల స్పష్టం చేయడం వల్ల కొన్ని ప్రశ్నలకు బదులిచ్చారు. సోమవారంతో వీరిద్దరి పోలీసు కస్టడీ గడువు పూర్తి కానుంది. కాటన్‌పేట ఠాణాలో నమోదైన కేసులో నేటికీ ఎనిమిది మంది నిందితులు పరారీలోనే ఉన్నారు. ఈ నేపథ్యంలో సంజన, రాగిణికి జామీను మంజూరు చేయవద్దని, తమ విచారణకు మరోసారి అవకాశం కల్పించాలని నార్కోటిక్ విభాగం పోలీసులు కోరనున్నారు. రాగిణి వేసుకున్న జామీను అర్జీ నేటికి వాయిదా పడింది. సంజన కొత్తగా నేడు జామీను అర్జీ వేసుకునే అవకాశం ఉంది. పోలీసుల విచారణకు అవకాశం ఇవ్వకుండా, జామీను మంజూరు చేయకపోతే వీరిద్దరూ పరప్పన అగ్రహార కారాగారానికి వెళ్లవలసి ఉంటుంది. ఇదే కేసులో అరెస్టయిన నిందితులను వివిధ ప్రాంతాల్లో విడివిడిగా, కొందరిని ఏకకాలంలో విచారణ చేశారు.
శ్రీలంకలో క్యాసినోకు విచ్చేయండి
జూదం, క్యాసినోలకు రావాలని, క్లబ్‌లలో విందులకు హాజరు కావాలంటూ ప్రజాదరణ పొందిన నటీనటులు అంతర్జాలంలో, ఫేస్‌బుక్‌లో, టీవీల్లో ప్రకటనలు ఇస్తుంటారు. శ్రీలంకలో నిర్వహించే క్యాసినో పార్టీలకు హాజరు కావాలని పలువురు నటీనటులు ఇలా ప్రకటనలు ఇచ్చినట్లు విచారణ అధికారులు గుర్తించారు. కన్నడ నటి ఐంద్రితా, తెలుగు, తమిళం, హిందీ తదితర భాషా చిత్రాల్లో నటించిన తాప్సి పన్ను, కాజల్ అగర్వాల్, బాలీవుడ్ కథానాయికలు బిపాసా బసు, ఊర్వశి రౌటేలా, జాక్వలిన్ ఫెర్నాండెజ్, నటుడు సోనూసూద్ తదితరులు ఈ తరహా ప్రకటనల్లో కనిపించారు. కొన్ని క్యాసినో యాజమాన్యాలు, ప్రకటన సంస్థల నుంచి వచ్చిన ఆఫర్లతోనే వీరు ఈ ప్రచార చిత్రాల్లో నటించి ఉంటారని అనుమానిస్తున్నారు. కొన్ని క్యాసినో పార్టీలకు బాలీవుడ్‌తో పాటు, అన్ని భాషల చలనచిత్రాల నటీనటులు, సాంకేతిక నిపుణులు హాజరయ్యారని ఇప్పటికే కొన్ని వీడియో ఫుటేజ్‌ల ద్వారా పోలీసులు గుర్తించారు. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో అరెస్టయిన నటి రియా చక్రవర్తికి శాండల్‌వుడ్‌కు చెందిన కొందరు కథానాయికలతో సంబంధం ఉందని అనుమానిస్తున్నారు. పూర్తి ఆధారాలతో విచారణ జరిపేందుకు సీసీబీ, నార్కోటిక్, ఈడీ, ఐటీ శాఖల అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
ఐఏఎస్ అధికారితో చర్చలు
డ్రగ్స్ కేసులో రాగిణి ద్వివేది అరెస్టయిన తరువాత మరో నటి సంజన గల్రాని ఒక సీనియరు ఐఏఎస్ అధికారితో పలుసార్లు మాట్లాడినట్లు విచారణలో గుర్తించారు. తనను రక్షించాలని ఆ అధికారితో పాటు, మరికొందరితో ఆమె మాట్లాడిందని చెప్పారు. తన నివాసంలో సోదాలు వద్దని, అరెస్టు చేయకుండా కాపాడాలంటూ కోరినట్లు కాల్ డేటా ఆధారంగా గుర్తించారు. ఆ అధికారికి చెందిన కొన్ని బ్యాంకు చెక్కులు సంజన నివాసంలో లభించాయి. విచారణలో ఇప్పటి వరకు గుర్తించిన అంశాలు, రాజకీయ నాయకులు, నటుల పేర్లను సీల్డ్ కవర్‌లో ఉంచి, న్యాయస్థానానికి అందిస్తామని అదనపు పోలీసు కమిషనర్ సందీప్ పాటిల్ తెలిపారు. అనారోగ్యం, ఇతర సమస్యలను పేర్కొంటూ మొదట్లో విచారణకు సహకరించని కథానాయికలు ఇప్పుడు తమ ప్రశ్నలకు స్పందిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
నేడు నివేదిక: మాదక ద్రవ్యాలు, ఉత్ప్రేరకాలను వినియోగించిన వారిని గుర్తించేందుకు సాధారణంగా డోప్ పరీక్షలు నిర్వహిస్తారు. మూత్రం, శిరోజాలు, చెమట, లాలాజలం తదితరాలను ఉపయోగించి, గత 92 రోజుల్లో వారు ఏవైనా మాదక ద్రవ్యాలను తీసుకున్నారో, లేదో గుర్తించేందుకు ప్రత్యేక పరీక్షలు నిర్వహించే సదుపాయాలు మడివాళలోని ఫోరెన్సిక్ ప్రయోగశాలలో సదుపాయాలు ఉన్నాయి. రాగిణి, సంజన నుంచి సేకరించిన నమూనాల పరీక్ష నివేదిక సోమవారం సాయంత్రం లోగా పోలీసుల చేతికి అందనుంది. ఈ నివేదికలో పాజిటివ్ వస్తే కథానాయికలు ఇద్దరికీ ఉచ్చు మరింత బిగిసే అవకాశం ఉంది. పరారీలో ఉన్న నిందితుడు నియాజ్ అహ్మద్, ఇప్పటికే అరెస్టయిన రాహుల్ శెట్టితో సంజన పలుసార్లు వాట్సాప్ ఛాటింగ్‌లు చేసినట్లు గుర్తించారు. మాదక ద్రవ్యాలతో పాటు అక్రమంగా నగదు, మానవ తరలింపు (హవాలా) తదితర నేరాలతో ఆమెకు సంబంధం ఉందని అనుమానిస్తున్నారు. ఈ ఆరోపణలు రుజువైతే ఆమె పెనం పైనుంచి పొయ్యిలో పడినట్లే.