"ప్రేక్షకులు థియేటర్‌కి రావడానికి సిద్ధంగా ఉన్నారనే విషయం మా చిత్రంతో మరోమారు రుజువైంది. మా భయాల్ని పటాపంచలు చేస్తూ విజయాన్ని అందించారు" అని అన్నారు దర్శకుడు సంపత్ నంది(sampath nandi). మాస్ కథలతో వరుసగా సినిమాలు తీస్తున్నారాయన. గోపీచంద్ కథానాయకుడిగా తెరకెక్కించిన 'సీటీమార్'(seetimaarr movie review) శుక్రవారం(సెప్టెంబరు 10) ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా సంపత్ నంది శనివారం(సెప్టెంబరు 11) హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు. ఆ విషయాలివీ...
"మేం తీసింది క్లాస్ సినిమా కాదు. మాస్ కథ. చక్కటి భావోద్వేగాలు, మంచి యాక్షన్, మంచి పాటలు ఉంటే తప్పకుండా మాస్ ప్రేక్షకులు థియేటర్‌కి వస్తారని నమ్మా. ఆ ధైర్యంతోనే ఓటీటీ వేదికల నుంచి ఆఫర్లు వచ్చినా థియేటర్లలోనే విడుదల చేశాం. చాలా రోజుల తర్వాత సి సెంటర్లలోనూ ప్రేక్షకులు థియేటర్లకి కదిలారు. ఇలాంటి మాస్ సినిమా చూసి చాలా కాలమైంది. పండగ రోజు ఒక పండగలాగే సినిమాని ఆస్వాదించారు. అందుకే మంచి ప్రారంభ వసూళ్లు వచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు... ఉత్తరాదిలోనూ షోలు పడ్డాయి. బాలీవుడ్ చిత్రాలతో పోలుస్తూ... వాటికంటే మంచి వసూళ్లు వచ్చాయని అంటున్నారు. చాలా మంది సినీ ప్రముఖులు ఫోన్ చేసి... బాక్సాఫీసుకి ఆక్సిజన్ ఇచ్చారని, వాక్సినేషన్ పూర్తి చేసేశారని అంటున్నారు. వీటన్నిటికీ కారణం ప్రేక్షకులే".
"గౌతమ్ నంద'(sampath nandi movies) తర్వాత గోపీచంద్‌తో మరో మాస్ సినిమా చేయాలనే రంగంలోకి దిగా. విద్యకి సంబంధించిన అంశంతో, ఓ పల్లెటూరి నేపథ్యంలో కథ అనుకున్నాం. ఆ తర్వాత మళ్లీ మేమే మనసు మార్చుకున్నాం. కబడ్డీ లాంటి ఓ మాస్ క్రీడకి, మాస్ అంశాల్ని జోడిస్తూ 'సీటీమార్' కథ రాసుకున్నాం. మహిళా సాధికారిత అంశాన్ని స్పృశిస్తూ ఓ మాస్ కథని చెప్పే ప్రయత్నం చేశాం. 'ఏమైందీ వేళ', 'బెంగాల్ టైగర్'(sampath nandi all movies list) తర్వాత నా దర్శకత్వానికి ఎంత పేరొచ్చిందో, మాటలకి అంత మంచి పేరొచ్చింది. ప్రతి ఒక్కరూ ఫోన్ చేసి మాటల గురించి చెబుతున్నారు. ఈ విజయం గోపీచంద్ అభిమానుల దాహం తీర్చిందనే మాట వినిపిస్తోంది".