బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యతో సినీపరిశ్రమలో బంధుప్రీతి అంశంపై తీవ్ర రగడ జరుగుతోంది. దీనిపై ఎవరి వాదన వారు వినిపిస్తున్నారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ ఈ అంశంపై స్పందించింది. ఓ ఇంటర్య్యూలో భాగంగా తన అభిప్రాయాలు పంచుకుంది. కొందరు వ్యక్తులు వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకోకుండా మాటల దాడికి దిగుతుంటారని చురకలు అంటించింది.
'వాళ్లను స్టార్స్‌ను చేసింది బంధుప్రీతి కాదు' - నెపోటిజంపై కరీనా కపూర్ స్పందన
నెపోటిజం గురించి మాట్లాడిన ప్రముఖ నటి కరీనా కపూర్.. బంధుప్రీతి లాంటి అంశాలను పక్కనపెట్టి కష్టపడి పనిచేసుకోవాలని సూచించారు. స్టార్స్ చేసే శక్తి ప్రేక్షకుల చేతిలోనే ఉంటుందని స్పష్టం చేసింది.
"కేవలం బంధుప్రీతి వల్లే 21 సంవత్సరాలుగా నట జీవితాన్ని కొనసాగించడం లేదు. అది సాధ్యం కాదు కూడా. ఇదే విధంగా మరికొంతమంది సూపర్ స్టార్ల పిల్లల విషయంలో జరగలేదు. కష్టపడి పనిచేసుకుంటూ ముందుకు సాగడం గురించే ఆలోచించాలి" అని కరీనా చెప్పుకొచ్చింది. కేవలం తన కుటుంబం కారణంగానే తనకు అవకాశాలు వచ్చాయని భావించడం లేదని, తన ఎదుగుదలకు తన కష్టం కూడా తోడైందని వెల్లడించింది. అంతేకాకుండా ఎవరిని స్టార్‌ని చేయాలనే అంశం ప్రేక్షకుల చేతిలోనే ఉందని చెప్పింది.
"మమ్మల్ని స్టార్‌లుగా తయారు చేసేది ప్రేక్షకులే. ఇంకెవరు కాదు. షారుక్ ఖాన్, అక్షయ్ కుమార్, రాజ్‌కుమార్ రావు, ఆయుష్మాన్ ఖురానా వంటి వారందరూ బయటినుంచి వచ్చినవారే. వారి కష్టపడేతత్వమే వారిని స్టార్లను చేసింది. ఆలియా భట్ అయినా, కరీనా కపూర్ అయినా..మేం కూడా కష్టపడే పనిచేస్తాం. మీరు మా సినిమాలు చూసి, ఎంజాయ్ చేస్తున్నారు. ప్రేక్షకులే మమ్మల్ని స్టార్లను చేస్తారు లేకపోతే వద్దనుకుంటారు. ఇప్పుడు వేలెత్తి చూపించే ఆ వ్యక్తులే తరతరాలుగా ఆదరిస్తున్నారు" అంటూ కరీనా చెప్పుకొచ్చింది.