హాయ్! నేను మీ సమంతని...ఇప్పటికి నా పేరు ఇదే కానీ... ఈ నెల 7 తర్వాత మాత్రం కొన్నాళ్లపాటు జానుగానే గుర్తుండిపోతా. 'జాను' సినిమాలోని రామ్, జాను పాత్రలు మీతో పాటే ఇంటి కొస్తాయి. కొన్నాళ్లపాటు మిమ్మల్ని వెంటాడతాయి. నవతరమేకాదు, పెద్దవాళ్లూ నా పాత్రలో వాళ్లని వాళ్లు చూసుకుంటారు. ఆ భరోసా నాదీ. నటుల్ని తీర్చిదిద్దేది వాళ్లకి ఎదురయ్యే సవాళ్లే అని నా నమ్మకం. అందుకే ప్రతిసారీ ఓ కొత్త సవాల్‌ని స్వీకరిస్తున్నా. అందులో భాగమే ఈ 'జాను'. నా సినీ ప్రయాణానికి పదేళ్లు. మహా అంటే ఒకట్రెండేళ్లు నటిస్తానేమో. దాని తర్వాత నా గురించి మాట్లాడుకోవాలి కదా. అలా జరగాలంటే 'జాను' లాంటి పాత్రలు చేయాల్సిందే. ఒకట్రెండేళ్లు అన్నానని ఆ తర్వాత సినిమాల నుంచి విరమిస్తుందా అనుకోవద్దు. సినిమాతో నా ప్రయాణం ఎప్పుడూ కొనసాగుతుంది. కాకపోతే నాకు పెళ్లయింది, కుటుంబం గురించి ఆలోచించాలి కదా అందుకే అలా చెబుతున్నా.
హీరోయిన్ల సినీ ప్రయాణం చాలా తక్కువేనని అందరికి తెలిసిన విషయమే. వాళ్లు తెరకు దూరమయ్యారంటే అందరూ మరిచిపోతారు, మరొకరు వస్తారు. కొద్దిమంది నటులు, వాళ్ల పేర్లు మాత్రం అలా నిలబడిపోతాయి. వీలైనన్ని రోజులు అలా నా పేరూ వినిపించాలనేదే నా ప్రయత్నం.
చాలా ప్రత్యేకం
ఒకొక్క సినిమా ఒక్కో అనుభవాన్నిస్తుంటుంది. 'జాను' నా సినీ ప్రయాణంలో చాలా ప్రత్యేకం. రెండు పాత్రలే ప్రధానంగా తెరపై కనిపిస్తుంటాయి. గొప్ప గొప్ప లొకేషన్లు ఉండవు. ప్రతి సన్నివేశాన్ని పండించాల్సిన బాధ్యత రెండు పాత్రలపైనే.. చాలా ఒత్తిడిగా ఉండేది. శర్వా, నేను సమన్వయంతో నటిస్తూ పాత్రల్లో గాఢత కనిపించేలా ప్రయత్నించాం. శర్వా కాకుండా, మరొకరు ఎవరున్నా ఆ పాత్రలు అంత బాగా పండేవి కాదేమో అనిపించింది. మాతృకని తీసిన దర్శకుడే ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఆయన్ని సెట్‌లో వందల ప్రశ్నలు అడిగి మరీ నటించేదాన్ని.
పేరు కోసమే నా తపన..
కెరీర్ ఆరంభం నుంచి పేరు కోసమే పనిచేశా. డబ్బు కోసం ఎప్పుడూ నటించలేదు. ఈ సినిమా చేస్తే ఎంత పేరొస్తుందని మాత్రమే ఆలోచించి సంతకం చేశా. డబ్బు దానంతట అదే వచ్చింది. తమిళంలో విజయవంతమైన '96'కి రీమేక్ అనే విషయం అందరికీ తెలిసిందే. ఒక ప్రేక్షకురాలిగా ఆ సినిమాని చూసినప్పుడు ఎంత ముచ్చటపడ్డానో. అందరూ అది విజయ్ సేతుపతి సినిమా అన్నారు కానీ, నాకు మాత్రం త్రిష సినిమా అనిపించింది. అప్పుడే ఈ సినిమా క్లాసిక్, దీన్ని ఎవ్వరూ రీమేక్ చేయకూడదని చెప్పా. చైతూ, నేను అదే మాట్లాడుకున్నాం. కానీ ఈ సినిమా రీమేక్‌లో నటించే అవకాశం నాకే వస్తుందని అనుకోలేదు. మొదట చేయకూడదని దిల్‌రాజుని కలవలేదు. ముందే చెప్పాను కదా... సవాళ్లే నటుల్ని తీర్చిదిద్దేది అని. దిల్‌రాజు రెండోసారి సంప్రదించాక ఈ సవాల్‌ని స్వీకరించాలని అనుకున్నా. ఈ సినిమా చేయకపోయుంటే, నేను జానుని కాకపోయుంటే మంచి అనుభూతిని, అనుభవాన్ని కోల్పోయే దాన్నని ఇప్పుడనిపిస్తోంది.
ఎన్నెన్నో జ్ఞాపకాలు..