‘ఏమాయ చేసావే’తో తెలుగు ప్రేక్షకుల మనసులను దోచి.... తర్వాత ఆ అభిమానాన్ని 'రంగస్థలం' వరకు పరుగులెత్తించింది. అందుకే ఆ 'మజిలీ'ని ఇష్టపడని అభిమాని ఉండడు. ఆమెను 'మనం' అనుకునేంతగా మెరిసిన ఆ 'మహానటి'...నేడు పుట్టినరోజు జరుపుకుంటోంది.
అగ్రకథానాయికగా ఎదిగేందుకు సినిమా బ్యాక్‌గ్రౌండ్ ఉన్న వారు అవసరం లేదని నిరూపిస్తూ...ఒక్క సినిమాతోనే ఎన్టీఆర్, మహేశ్‌బాబు, పవన్‌కల్యాణ్, రామ్‌చరణ్, అల్లు అర్జున్ వంటి అగ్ర కథానాయకులతో నటించింది.
రవివర్మ గీసిన బొమ్మ,.!
చెన్నైలోని పల్లవరంలో 1987 ఏప్రిల్ 28న జన్మించింది సమంత. తండ్రి తెలుగువారు , తల్లి మలయాళీ. హోలీ ఏంజిల్స్ ఆంగ్లో ఇండియన్ హయ్యర్ సెకండరీ స్కూల్‌లో ప్రాథమిక విద్యాభ్యాసం...స్టెల్లా మేరీస్ కాలేజీలో డిగ్రీ చదువుకుంది. డిగ్రీ చివరి సంవత్సరం నుంచి మోడలింగ్ వైపు అడుగులేసింది. ఆ సమయంలో దర్శకుడు రవివర్మన్ దృష్టిలో పడింది. ఆయన దర్శకత్వంలో ‘మాస్కోవిన్ కావేరీ’ చిత్రంలో కథానాయికగా తొలిసారి వెండితెరపై అరంగేట్రం చేసింది.
మేనన్ మాయ...
తెలుగు తెరపై చీరకట్టు అందాన్ని చక్కగా చూపిస్తూ...గౌతమ్ మేనన్ తీసిన 'ఏమాయ చేసావే' చిత్రం తెలుగు కుర్రకారు మదిని కొల్లగొట్టింది. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు.
పెద్ద హీరోలందరితో...
ఎన్టీఆర్‌తో ‘బృందావనం’, మహేశ్ సరసన ‘దూకుడు’, రాజమౌళి దర్శకత్వంలో ‘ఈగ’ చిత్రాల్లో నటించింది. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘అత్తారింటికి దారేది’, ‘మనం’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’, ‘అఆ’, ‘మహానటి’, ‘యూ టర్న్’తో పాటు... ఇటీవల విడుదలైన ‘రంగస్థలం’ సమంత క్రేజ్‌ని అమాంతం పెంచేశాయి. తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేస్తూ అలరించింది సామ్. ఆమె అభిమాన హీరో సూర్య సరసన ‘అంజాన్’, ‘24’ సినిమాల్లో నటించడం విశేషం.
ప్రస్తుతం నందినిరెడ్డి దర్శకత్వంలో ‘ఓ బేబీ’తో పాటు, నాగార్జునతో కలిసి ‘మన్మథుడు2’లో నటిస్తోంది సమంత.
పురస్కారాలు..
‘ఏమాయ చేసావెే’తో ప్రత్యేక జ్యూరీ నంది పురస్కారాన్ని అందుకున్న సమంత, ‘ఎటో వెళ్లిపోయింది మనసు’తో ఉత్తమ నటిగా నంది అవార్డు సొంతం చేసుకుంది.
ప్రేమ వివాహం...
తెలుగులో తొలి చిత్రం చేస్తున్నప్పుడే సహ నటుడైన నాగచైతన్య, సమంత మధ్య ప్రేమ చిగురించింది. ఆ తర్వాత పెళ్లితో ఒక్కటయ్యారు. ఆమె అసలు పేరు సమంత రూత్ ప్రభు కాగా, నాగచైతన్యని వివాహం చేసుకున్నాక సమంత అక్కినేనిగా పేరు మార్చుకున్నారు.
మనసు వెన్న...సేవలోనూ మిన్న
అక్కినేని, దగ్గుబాటి కుటుంబంతో చక్కగా కలిసిపోయిన సమంత...కథానాయికగా కొనసాగుతూనే నాగచైతన్యతో వైవాహిక జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ ఆమె చురుగ్గా పాల్గొంటుంటారు. ప్రత్యూష స్వచ్ఛంద సంస్థ తరఫున మహిళలకి, చిన్నారులకి తగిన సహాయాన్ని అందిస్తుంటారు.