నాయికా ప్రాధాన్య చిత్రాలతో మెప్పించడం అనుకున్నంత తేలిక కాదు. సోలోగా కథని నడిపించగలగాలి.. ప్రేక్షకుల్ని థియేటర్లకి రప్పించగల సత్తా.. స్టార్ డమ్ ఉండాలి. ఇలా అనేక అంశాలతో ముడిపడి ఉంటుంది. ఇక పాన్ ఇండియా చిత్రమంటే.. అన్ని భాషల్లో ఆమెకున్న ఆదరణ.. మార్కెట్ వంటి విషయాలను దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ అంశాలన్నీ నటి సమంతలో పుష్కలంగా ఉన్నాయి.
అందుకే సమంతతో 'శాకుంతలం' అనే పాన్ ఇండియా చిత్రం తెరకెక్కించేందుకు సిద్ధమయ్యారు దర్శకుడు గుణశేఖర్. మహాభారతం.. ఆదిపర్వంలోని శకుంతల, దుష్యంతుల ప్రేమకథ ఆధారంగా రూపొందుతున్న చిత్రమిది. ఇందులో శకుంతలగా ప్రధాన పాత్రలో నటస్తోంది సామ్. ఇది ఆమె కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమా. అలాగే ఆమె నుంచి వస్తున్న తొలి పాన్ ఇండియా చిత్రం. అందుకే దీనిపై దక్షిణాదితో పాటు ఉత్తరాది ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలున్నాయి. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ ఇతిహాసచిత్రం.. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.
-
20ఏళ్ల సినీ ప్రయాణంలో అటు కమర్షియల్ చిత్రాలతోనూ.. ఇటు నాయికా ప్రాధాన్య సినిమాలతోనూ అందరినీ మెప్పించింది నటి శ్రియ. దక్షిణాదితో పాటు ఉత్తరాదిలోనూ అశేష ప్రేక్షక గణాన్ని సంపాదించుకుంది. ఇప్పుడీ ఆదరణను అస్త్రంగా చేసుకునే.. 'గమనం' సినిమాతో పాన్ ఇండియా నాయికగా మెరుపులు మెరిపించే ప్రయత్నం చేస్తోంది శ్రియ. ఇది ఆమె నటిస్తున్న తొలి బహుభాషా చిత్రం. క్రిష్ శిష్యురాలు సుజనా రావు తెరకెక్కిస్తున్నారు. ఓ చెవిటి ఇల్లాలి జీవిత గాథ.. ఓ జంట ప్రేమకథ.. మరో అనాథ జీవన ప్రయాణం.. ఇలా మనసుల్ని కదిలించే మూడు విభిన్నమైన కథలతో ఈ సినిమా రూపొందిస్తున్నారు. నగరంలో కురిసిన జడివాన.. వీళ్ల జీవితాల్ని ఎలా చిన్నాభిన్నం చేసిందన్నది ఇతివృత్తం. ఇందులో శ్రియ ఓ చెవిటి ఇల్లాలి పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.