'దబంగ్ 3'లో పవర్‌ఫుల్ పోలీస్ అధికారిగా కనిపించిన బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ఖాన్.. ప్రస్తుతం మరో భారీ యాక్షన్ థ్రిల్లర్‌తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. 'రాధే: యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్'గా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ చిత్రంలో చివరి 20 నిమిషాల పాటు సాగే క్లైమాక్స్ చిత్రీకరణకు ఏకంగా రూ.7.5 కోట్లను వెచ్చిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. సల్మాన్, రణదీప్ హుడాల మధ్య వచ్చే సన్నివేశాల కోసం అత్యాధునిక క్రోమా కీ టెక్నాలజీని వాడారని సమాచారం. ఈ విధానాన్ని భారత్‌లో ఇప్పటి వరకూ బాహుబలి, బాహుబలి 2లలో మాత్రమే వాడారు.
ప్రస్తుతం దిల్లీ, కోల్‌కతా, జైపుర్, లఖ్‌నవూలలోని అందమైన లొకేషన్లలో ఈ సినిమా చిత్రీకరణ సాగుతోంది. చివరి పోరాట సన్నివేశాన్ని మాత్రం దుబాయ్‌లోని స్టూడియోలో ప్లాన్ చేశారు. క్లైమాక్స్ చిత్రీకరణ గురించి సల్మాన్, ప్రభుదేవా తమ వీఎఫ్‌ఎక్స్ బృందంతో చర్చించారని తెలుస్తోంది. అయితే వారి అంచనాలకు తగినట్టుగా తీయటం క్రోమా కీ విధానంలో మాత్రమే సాధ్యమని.. దానికి సుమారు రూ.ఏడు కోట్లు ఖర్చవుతుందని అంచనా. సాధారణ చిత్రీకరణతో పోలిస్తే దానికి అవసరమైన లైటింగ్‌ను ఏర్పాటు చేయటం ఖరీదుతో కూడుకున్న వ్యవహారం. అతి కీలకమైన ఘట్టాలు అందరూ శభాష్ అనేలా ఉండటానికి ఆ మాత్రం ఖర్చుపెట్టడంలో తప్పు లేదనుకున్న సల్మాన్.. వెంటనే దీనికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేశాడట.