కరోనా నియంత్రణకు ప్రభుత్వం చెబుతోన్న సూచనలను పాటించాలని ఇన్‌స్టా వేదికగా ప్రజలను కోరాడు హీరో సల్మాన్ ఖాన్. లాక్‌డౌన్ నిబంధనలు అతిక్రమించి రోడ్లపై సంచరించే వారిని 'జోకర్లు'గా అభివర్ణించాడు. ఇలాంటి జోకర్ల వల్ల మిగిలిన వారంతా ఇలా ఇంట్లో ఉండి ఇబ్బంది పడాల్సి వస్తోందన్నాడు. ఇది గేమ్‌షో కాదని.. ప్రస్తుతం మనమందరం బిగ్‌బాస్ షోలో సభ్యుల లాగా ఉన్నామని తెలిపాడు. ఎలాంటి అవసరం లేకున్నా రోడ్లపైకి వచ్చి తిరిగితే వారితో పాటు వారి కుటుంబాన్ని ప్రమాదంలోకి నెట్టినట్లేనని వెల్లడించాడు.
ప్రస్తుత పరిస్థితుల్లో మాస్క్ ధరించడం ఎంతో అవసరమని సల్మాన్ చెప్పాడు. ఇటీవలే తన స్నేహితుడికి ఎదురైన అనుభవాన్ని వివరించాడు.
"నేను రెండు రోజులు సెలవు తీసుకుందామని ఫామ్‌హౌస్‌కు వచ్చా. కానీ కరోనా వైరస్ ప్రతిఒక్కరు సెలవులు తీసుకునేలా చేసింది. లాక్‌డౌన్ విధించడం వల్ల నా తల్లి, ఇద్దరు సోదరీమణులు, వారి పిల్లలు.. ఇలా మా కుటుంబం మొత్తం ఇక్కడే ఉండిపోయాం. ఫామ్‌హౌస్‌లో ఉన్నవారి కోసం రేషన్ తీసుకురావడానికి నా స్నేహితుడు బయటకు వెళ్లాడు. రోడ్డుపై నా స్నేహితుడిని పోలీసులు అడ్డుకున్నారు. అయితే అతడు పోలీసులతో మాట్లాడటానికి తన ఫేస్ మాస్క్ తొలగించాడు. కానీ వీధుల్లో ఉన్న పోలీసులు మాస్క్ పెట్టుకోవాల్సిందిగా నా స్నేహితుడిని కోరారు. ఇంటికి వచ్చాక నేనూ మాస్క్ తీయడం మంచిది కాదని అతనికి చెప్పాను"