బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అకాల మరణం యావత్తు దేశాన్ని కదిలించింది. అతడి మరణం సినీ అభిమానులను తీవ్రంగా కలచివేసింది. ఈ క్రమంలో చిత్రపరిశ్రమలో పాతుకుపోయిన బంధుప్రీతిపై తీవ్రంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇటీవల కంగనా రనౌత్ సహా మరికొందరు బహిరంగంగానే ఇదే అంశాన్ని లేవనెత్తి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా సుశాంత్ మృతికి సంతాపం తెలిపిన బాలీవుడ్ దర్శకుడు అభినవ్ కశ్యప్.. పలు సంచలన ఆరోపణలు చేశారు. తన కెరీర్‌ను సల్మాన్ ఖాన్, అతడి కుటుంబ సభ్యులు నాశనం చేశారని ఆరోపించారు.
"2010లో సల్మాన్ కెరీర్‌లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన దబాంగ్ చిత్రానికి నేను దర్శకత్వం వహించాను. ఈ సినిమా సీక్వెల్‌కు కూడా నేనే డైరెక్షన్ చేయాల్సింది. కానీ అలా జరగలేదు. సల్మాన్ సోదరులు అర్బాజ్ , సోహైల్ ఖాన్‌లే ఇందుకు కారణం. వారు తమ ప్రయోజనాల కోసం నన్ను బెదిరించడం ప్రారంభించారు. నా కెరీర్‌ను నియంత్రించాడనికి వారు చాలా కాలంపాటు ప్రయత్నిస్తూనే ఉన్నారు. 2013లో నేను దర్శకత్వం వహించిన చివరి చిత్రం 'బేషారం' విడుదలను ఆపేందుకు సల్మాన్, అతడి కుటుంబం అన్ని రకాల ప్రయత్నాలు చేసింది. నకిలీ సందేశాలు, కాల్స్ ద్వారా కూడా బెదరించారు. దీనిపై 2017లో పోలీసులకు ఫిర్యాదు చేసినా లాభం లేకుండా పోయింది. నా కుటంబాన్ని ఛిన్నాభిన్నం చేసి ప్రతీకారం తీర్చుకున్నారు. "
-అభినవ్ కశ్యప్, దర్శకుడు.
టాలెంట్ మేనేజ్మెంట్ ఏజెన్సీ కుతంత్రాల వల్ల కూడా ప్రతిభ కలిగిన నటీనటులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు అభినవ్. సుశాంత్ బలవన్మరణానికి కారణం అదే కారణమని తెలిపారు.