బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్‌ఖాన్‌పై హీరోయిన్ సోనాక్షి సిన్హా ప్రశంసలు కురిపించింది. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన 'దబాంగ్', 'దబాంగ్ 2' చిత్రాలు విజయాలు అందుకున్నాయి. ప్రస్తుతం ఈ సిరీస్‌లో రూపొందుతున్న మూడో చిత్రం 'దబాంగ్ 3' త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ఇటీవలే ఓ మీడియా సమావేశంలో మాట్లాడిన సోనాక్షి.. స్టార్‌డమ్ ఉన్నా సరే సల్మాన్ చాలా సాధారణమైన వ్యక్తిగా ఉంటాడని చెప్పింది.
సల్మాన్‌తో మొదటిసారి 'దబాంగ్' కోసం పనిచేశాను. 2010లో విడుదలైందీ చిత్రం. ప్రస్తుతం 'దబాంగ్ 3' లో కలిసి నటిస్తున్నాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు సల్మాన్ ప్రవర్తనలో ఎలాంటి మార్పు లేదు. ఆయన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నా. నా జీవితంలో వాటిని ఫాలో అవుతుంటాను. అన్నింటికంటే ముఖ్యమైనది సల్మాన్ తన స్టార్‌డమ్‌ను తలకెక్కించుకోడు. స్టార్‌డమ్ ఉన్నా సరే, సాధారణ వ్యక్తిలానే ఉంటాడు. ఎంతో ఖరీదైన హోటళ్లలో బస చేసే సల్మాన్.. సాధారణమైన ఇంటిలోనూ ఉండగలడు.