నటుడు సాయిధరమ్ తేజ్‌కు మెగాస్టార్ చిరంజీవి స్పెషల్ బర్త్‌డే గిఫ్ట్ ఇచ్చారు. సాయిధరమ్ తేజ్ కథానాయకుడిగా సుబ్బు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'సోలో బ్రతుకే సో బెటర్'. నభా నటేశ్ హీరోయిన్. గురువారం సాయిధరమ్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం నుంచి ఓ బ్రేకప్ పాటను తాజాగా చిరంజీవి సోషల్‌మీడియా వేదికగా విడుదల చేశారు.
'ఒగ్గేసిపోకే అమృతా నేను తట్టుకోక మందు తాగుతా. ఒట్టేసి చెబుతున్న అమృతా నువ్వు వెళ్లిపోతే ఒంటరైపోతా' అంటూ సాగే ఈ పాటలో సాయిధరమ్ తేజ్, నభానటేశ్ బ్రేకప్‌ను చూపించనున్నట్లు సాంగ్ మేకింగ్ వీడియో చూస్తే తెలుస్తోంది.
అనంతరం, సాయితేజ్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ.. 'నా ప్రియమైన సాయిధరమ్‌తేజ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. 'సోలో బ్రతుకే సో బెటర్' చిత్రం నుంచి 'అమృతా' పాటను విడుదల చేస్తున్నా. నీలాగే సింగిల్‌గా ఉన్న ఎంతోమంది కోసం ఈ పాట. ఎంజాయ్' అని చిరు ట్వీట్ చేశారు. చిరు ట్వీట్‌పై స్పందించిన సాయిధరమ్‌తేజ్.. తన మామయ్యకు థ్యాంక్స్ తెలిపారు. 'ఎవరైనా కావాలనుకునే బెస్ట్ బర్త్‌డే గిఫ్ట్ ఇదే. నా పుట్టినరోజును మరెంతో స్పెషల్‌గా చేసినందుకు థ్యాంక్యూ సో మచ్ మామ. మీ ఆశీర్వాదం కంటే వేరే ఏదీ నేను కోరను. లవ్ యూ మామ' అని రిప్లై ఇచ్చారు.
సాయిధరమ్‌తేజ్ పుట్టినరోజు సందర్భంగా పలువురు సినీ సెలబ్రిటీలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. వివిధ సందర్భాల్లో సాయితేజ్‌తో దిగిన ఫొటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. అంతేకాకుండా సాయిధరమ్‌తేజ్‌కు అంతా మంచే జరగాలని, మున్ముందు ఆయన ఎన్నో విజయాలను అందుకోవాలని ఆశిస్తూ పోస్టులు పెట్టారు. దర్శకుడు దేవకట్టా సైతం సాయితేజ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ట్విటర్ వేదికగా ఓ ప్రత్యేక వీడియోను పోస్ట్ చేశారు.
మరోవైపు నటుడు నితిన్, సాయికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ.. 'పుట్టినరోజు శుభాకాంక్షలు డార్లింగ్. బ్యాచిలర్‌గా ఆఖరి పుట్టినరోజు ఎంజాయ్ చేయ్. ఇంతకీ డేట్ ఎప్పుడు ఫిక్స్ చేశావ్' అని ట్వీట్ చేశారు.