తాను కూడా నెపోటిజమ్ బాధితుడని బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ చెప్పారు. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో తనను ట్రోల్ చేయడం చాలా బాధగా ఉందని అన్నారు. ఇండస్ట్రీలో తాను ఎదుర్కొన్న సమస్యల గురించి వివరించారు. తన జీవితంలోనూ చీకటి రోజులున్నాయని, చాలాసార్లు ఒంటరిగా కూర్చొని ఏడ్చినట్లు చెప్పారు. తాను నటిస్తున్న సినిమా నుంచే తీసేశారని గతాన్ని గుర్తుచేసుకున్నారు.
బాలీవుడ్‌లోనూ రాజకీయాలు ఉంటాయని సైఫ్ చెప్పారు. తాను ఇండస్ట్రీలో ఇన్సైడర్ అయినప్పటికీ బంధుప్రీతి సమస్యను ఎదుర్కొన్నానని ఆవేదన వ్యక్తం చేశారు.
"కొన్ని సినిమాలు అవకాశాలు వచ్చాయి. అంతలోనే మళ్లీ ఫోన్ చేసి ఈ ప్రాజెక్టు నుంచి నన్ను తప్పిస్తున్నామని అనేవారు. దీనివెనుక ఎన్నో రాజకీయాలు జరుగుతాయి. కెరీర్లో ఇదే సమస్యతో చాలాసార్లు ఇబ్బందులు ఎదుర్కొన్నా. ఎంతో కష్టపడ్డాను. ఇదే విషయాన్ని బయటకు చెబితే నన్ను హేళన చేశారు. ఎంతో బాధగా అనిపించింది. వీటన్నింటినీ హీరో అక్షయ్‌కుమార్ ప్రత్యక్షంగా చూశారు. అతడు పడ్డ కష్టాలను నేను చూశాను. మొత్తంగా పరిశ్రమలోని ప్రతిఒక్కరి జీవితంలో ఒడుదొడుకులు ఉంటాయి. కానీ చిత్రసీమలో మంచి మనుషులు కూడా ఉంటారు. ఒకరి జీవితంపై తీర్పునిచ్చే అధికారం మనకు లేదని నా అభిప్రాయం"