ఎప్పటికప్పుడు విభిన్న కథలను ఎంచుకుంటూ కెరీర్‌లో ముందుకు సాగుతున్న యువ కథానాయకుడు సాయి తేజ్. వరుస అపజయాల తర్వాత గతేడాది 'చిత్రలహరి', 'ప్రతి రోజూ పండగే' చిత్రాలతో మంచి విజయాలను అందుకున్నాడు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న 'సోలో బ్రతుకే సో బెటర్' చిత్రీకరణ దశలో ఉంది.
తాజాగా తన కొత్త చిత్రాన్ని ప్రకటించాడు సాయి తేజ్. ఈ సారి మిస్టరీ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలిపారు. చక్రంలో నుంచి ఒంటి కన్నుతో ఓ వ్యక్తి చూస్తున్నట్లు విడుదల చేసిన పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.
"సరికొత్త జోనర్‌లో సినిమాలు చేయడం ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. అది కూడా నాకెంతో ఇష్టమైన దర్శకుడు సుకుమార్ గారితో కలిసి పనిచేయడం మరింత ప్రత్యేకం. #SDT15 మిస్టరీ థ్రిల్లర్‌ను ఎస్‌వీసీసీ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు"
-సాయి ధరమ్ తేజ్, టాలీవుడ్ కథానాయకుడు
ఈ చిత్రానికి సుకుమార్ స్క్రీన్‌ప్లే అందించడం విశేషం. కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్నాడు. ఎస్‌వీసీసీ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ సినిమాలోని నటీనటులు, ఇతర సాంకేతిక బృందం, టైటిల్ వంటి వివరాలను త్వరలోనే వెల్లడించనుంది చిత్రబృందం.