క్రిస్మస్కు ఇంకా వారం రోజుల సమయముంది. ఈ సీజన్లో సినిమాలు విడుదల చేసేందుకు చిత్ర నిర్మాతలు ముందుకొస్తుంటారు. ఎప్పటిలాగే ఈసారి నాలుగు చిత్రాలు రేపు (డిసెంబర్ 20) తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఇందులో నందమూరి హీరో బాలకృష్ణ నటించిన 'రూలర్'తో పాటు మెగా మేనల్లుడు సాయితేజ్ హీరోగా రూపొందిన 'ప్రతిరోజూ పండగే' ఉన్నాయి. వీటితో పాటు కార్తీ, జ్యోతిక ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన 'దొంగ', బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ 'దబంగ్ 3' బాక్సాఫీస్ వద్ద అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి.
రూలర్
నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'రూలర్'. వేదిక, సోనాల్ చౌహాన్ హీరోహీరోయిన్లు. బాలయ్య మాస్ డైలాగ్స్‌తో పాటు యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకుల్ని అలరిస్తాయని చిత్రబృందం ధీమాగా ఉంది. చిరంతన్ భట్ అందించిన సంగీతం ఆకట్టుకునేలా ఉంది.
ప్రతిరోజూ పండగే
మెగా మేనల్లుడు సాయితేజ్, రాశీ ఖన్నా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'ప్రతిరోజూ పండగే'. మారుతి దర్శకుడు. కుటుంబకథా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాలో తేజ్ సిక్స్ ప్యాక్‌లో కనిపించనున్నాడు. తమన్ అందించిన సంగీతం ఆకట్టుకునేలా ఉంది. 'చిత్రలహరి' విజయంతో గాడిలో పడ్డ తేజ్‌కు ఈ చిత్రం మరింత ఘనవిజయాన్ని అందిస్తుందని చిత్రబృందం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.