తెలంగాణ

telangana

ETV Bharat / sitara

Sai Pallavi: 'రీమేక్‌ అని నో చెప్పలేదు.. ఆ భయంతోనే చెప్పా' - లవ్ స్టోరీ విడుదల

'ఫిదా' సినిమాలో భానుమతి పాత్రతో అదరగొట్టిన సాయి పల్లవి.. డ్యాన్స్​తో, నటనతో దూసుకెళ్తోంది. ఆమె నటించిన లవ్​ స్టోరీ(Love Story Movie) చిత్రం త్వరలోనే విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు చెప్పింది సాయి పల్లవి. డైరెక్టర్ శేఖర్ కమ్ముల(Sekhar Kammula Movies List) నుంచి చాలా విషయాలు నేర్చుకున్నట్లు తెలిపింది. ఓ సినిమా అంగీకరించాలంటే చాలా ధైర్యం కావాలని చెప్పింది.

Sai Pallavi
సాయి పల్లవి

By

Published : Sep 23, 2021, 5:38 AM IST

'వచ్చిండే, మెల్లమెల్లగా వచ్చిండే' అంటూ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి 'సారంగదరియా'తో యూట్యూబ్‌ రికార్డుల దుమ్ముదులిపిన నటి సాయిపల్లవి(Sai Pallavi New Movie). నటనతో, నాట్యంతో ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని చూపిస్తూ దూసుకెళ్తోంది. నాగచైతన్యతో కలిసి ఆమె నటించిన 'లవ్‌స్టోరి'(Love Story Release date) ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు మీకోసం.

శేఖర్‌ కమ్ముల ఫోన్‌ చేయగానే సినిమాను అంగీకరించారట? డైరెక్టర్‌ ఆయనని అంగీకరించారా?లేక స్క్రిప్ట్నచ్చి చేశారా?

సాయిపల్లవి:శేఖర్‌ కమ్ముల ఫోన్‌ చేసి కథ నీకు నచ్చిందా? అని అడిగారు. నేను మనసులో ముందే ఒకే చెప్పాలని నిర్ణయం తీసుకున్నాను. కథ కూడా విపరీతంగా నచ్చింది. 'లవ్‌స్టోరి' ఒప్పుకోడానికి శేఖర్‌తోపాటు, స్క్రిప్ట్ కూడా ముఖ్య కారణమే.

ఫిదా సినిమాలో సాయి పల్లవి

భానుమతి, మౌనిక పాత్రలకు తేడా ఏంటి?

సాయిపల్లవి:రెండు పాత్రల నేపథ్యాలు వేరు. వాటి ప్రయాణాలు వేరు. పెళ్లయ్యాక అమ్మాయిలే ఇళ్లు విడిచి ఎందుకెళ్లాలని 'ఫిదా'లో భానుమతి ప్రశ్నిస్తుంది. మౌనికది మరో రకమైన పోరాటం. ప్రపంచమంతా ఏదీ సాధించలేవని అంటున్నా, చేసి చూపిస్తానని ధైర్యంగా ముందుకెళ్లే అమ్మాయి. జీవితాన్ని గెలవడానికి అద్భుతమైన ప్రతిభ ఉండాల్సిన అక్కర్లేదు. సంకల్పబలం ఉంటే చాలని చూపించే పాత్ర.

పూర్తిగా డ్యాన్స్‌ నేపథ్యంలో తెరకెక్కిందా?

సాయిపల్లవి:డ్యాన్స్ ఇందులో ఒక భాగం మాత్రమే. పూర్తిగా దాని చుట్టూ తిరిగే కథ మాత్రం కాదు. సినిమా కోసం ప్రత్యేకమైన శిక్షణేమీ తీసుకోలేదు. శేఖర్‌, ఆనీ మాస్టర్లతో రిహార్సల్స్‌ మాత్రం చేశాను.

సాయి పల్లవి

నిజజీవితంలో ఎప్పుడైనా ఇలాంటి వివక్షను ఎదుర్కొన్నారా?

సాయిపల్లవి:అమ్మాయిలకు ఇలాంటి వివక్ష ఎదురు కాలేదంటేనే ఆశ్చర్యపడాలి. మా అమ్మ, చెల్లి, ఫ్రెండ్స్‌ ఇలా అందరికీ ఇవి జరిగాయి. నిజానికి ఈ వివక్ష ఎక్కువగానే ఉంది. అమ్మాయిలకు ఇవి సాధరణమే, బయటకు చెప్పాల్సిన అవసరమేంటనే భావన జనాల్లో ఇంకా ఉంది. ఇప్పుడిప్పుడే సమాజం దీని గురించి మాట్లాడుతోంది. ఇలాగే వెళ్తే వందేళ్ల తర్వాత కొంత మార్పు రావచ్చేమో.

సెట్స్‌లో ఎక్కువ అమ్మాయిలు ఉండటం వల్ల ఏదైనా మార్పు కనిపించిందా?

సాయిపల్లవి:కళకు లింగభేదం ఏమి ఉండదు. అబ్బాయైనా, అమ్మాయైనా ఒకే రకంగా కృషి చేస్తారు. లవ్‌స్టోరిలో టెక్నీషియన్స్‌ ఎక్కువగా అమ్మాయిలు ఉండటం వల్ల పనితీరులో కొంత మార్పైతే కనిపించింది.

లవ్​ స్టోరీ

రీమేక్స్‌ చేయకూడదనే నిబంధన పెట్టుకున్నారా?

సాయిపల్లవి:అలాంటి రూల్‌ ఏమీ పెట్టుకోలేదు. కానీ అనువాద చిత్రాలంటే కొంచెం భయముంది. మాతృక స్థాయిలో చేయాలి, లేదా అంతకన్నా కొత్తగా ఏదైనా ప్రయత్నించాలనే ఒత్తిడి ఉంటుంది. రీమేక్‌ సినిమా అని నో అని చెప్పలేదు. అందులోని పాత్రకు న్యాయం చేయలేను అనిపించింది.

పెద్ద హీరోలకు నో చెప్పడానికి చాలా ధైర్యం కావాలి కదా?

సాయిపల్లవి:సినిమాను అంగీకరించి సెట్‌లోకి వెళ్లాక ఇబ్బందిపడితే బాగోదు కదా. వాస్తవానికి అంగీకరించడానికే ఎక్కువ ధైర్యం కావాలి. మనం ఆ పాత్రకు సరిపోమని నిజాయతీగా చెబితే వాళ్లు కూడా అర్థం చేసుకుంటారు.

సాయి పల్లవి

'పావకథైగళ్' ఇలాంటి నేపథ్యంలోనే వచ్చింది. ఈ రెండు సినిమాలకు తేడా?

సాయిపల్లవి:సినిమాపరంగా సమాజం కోసం కొన్ని సార్లు ఏదైనా చేయాలనిపించినా, అలాంటి అవకాశం మాత్రం తక్కువ సార్లు వస్తుంది. ఇప్పటిదాకా అమ్మాయిని బాధితురాలిగా చూపించినవే సినిమాలు ఎక్కువగా వచ్చాయి. సమస్యలను అధిగమించి ఆ ప్రయాణాన్ని ఎలా కొనసాగించిందనేది శేఖర్‌ కమ్ముల ఇందులో కమర్షియల్‌గా చూపించారు. ఇక 'పావకథైగళ్' తండ్రీకూతుళ్ల మధ్య జరిగే 30 నిమిషాల చిన్న కథ. అత్యాచారాల గురించి తెలిసినప్పుడు లోపల ఒకరకమైన బాధ ఉండేది. కానీ ఏం చేయలేని పరిస్థితి. నా వంతుగా ఏదైనా చేయాలనే ఉద్దేశంతో వీటిని అంగీకరించాను.

శేఖర్‌ కమ్ములతో పనిచేసిన తర్వాత మీలో వచ్చిన మార్పేంటి?

సాయిపల్లవి:నేను ఇదివరకన్నా సున్నితంగా మారిపోయాను. ఆయన ఎక్కడైనా సాధారణంగానే ఉంటారు. నేల మీదే కూర్చొని పనిచేస్తారు. అలాంటి సాధారణ జీవితాన్ని నేను కూడా అలవాటు చేసుకున్నాను. ఏదైనా తప్పు జరిగితే ధైర్యంగా అడగమంటారు. మనం బాధపడిన విషయం వారికి తెలియాలంటే పోరాడక తప్పదని చాలా సార్లు చెబుతుంటారు.

అవుట్‌డోర్‌ షూటింగ్‌లో ప్రజల నుంచి ఎలాంటి స్పందన లభించింది?

సాయిపల్లవి:నేను తెలుగు అమ్మాయిలానే ఫీల్‌ అవుతాను. 'ఫిదా' కోసం బాన్సువాడ, ఇప్పుడు ఆర్మూర్‌ దగ్గర పిప్రీలో చేశాం. అక్కడి జనం హీరోహీరోయిన్లనే తేడా లేకుండా మాతో మాట్లాడారు. కొవిడ్‌ సమయంలో, రాత్రిపూట షూటింగ్‌ జరిగినా విసుక్కోలేదు. దగ్గర కూర్చొని చేయిపట్టుకుని ప్రేమగా మాట్లాడతారు. చిన్నచిన్న విషయాలు అడిగి తెలుసుకుంటారు. బాన్సువాడలో ఓ స్థానిక డిజైనర్‌ చీరను కూడా కానుకగా ఇచ్చారు. గ్రామాలకు వెళ్తే అక్కడే ఉండిపోవాలి అనిపిస్తుంది. అంత ప్రేమగా ఉంటారు.

ఇదీ చదవండి:

Love Story Movie: 'ఆయన స్వేచ్ఛ వల్లే ఇది సాధ్యమైంది'

ABOUT THE AUTHOR

...view details