మలయాళీ అభిమానులు, 'మలర్'గా తనను వారి గుండెల్లో ఉంచేసుకున్నారని చెప్పింది హీరోయిన్ సాయిపల్లవి. ఆ భాషలో వచ్చిన ప్రేమకథా చిత్రం 'ప్రేమమ్'లో మలర్ టీచర్‌గా కనిపించి అదరగొట్టిందీ భామ. కుర్రకారు హృదయాల్లో చెరిగిపోని స్థానం సొంతం చేసుకుంది. నేటితే ఆ సినిమాకు ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా, తన జీవితంలో జరిగిన మరిచిపోని సంఘటనను గుర్తు చేసుకుంది. ఇప్పటికీ తనను కేరళలో మలర్గానే గుర్తిస్తున్నారని చెప్పుకొచ్చింది.
'మలర్‌గా నన్ను వారి గుండెల్లో ఉంచేసుకున్నారు'
తనను ఇప్పటికీ కేరళలో 'మలర్' అనే పిలుస్తారని చెబుతూ ఎమోషనల్ అయింది నటి సాయిపల్లవి. ఈ మధ్య కాలంలో తనకు జరిగిన ఓ అనుభవాన్ని గుర్తుచేసుకుంది.
"నన్ను అక్కడ మలర్ అని మాత్రమే పిలవడం లేదు. 'మై మలర్' అంటూ వారి గుండెల్లో చోటిచ్చారు. కొన్ని నెలల క్రితమే నా జీవితంలో జరిగిన సంఘటనే ఇందుకు నిదర్శనం. నేను, మా చెల్లి కలిసి ఓ చోటుకు వెళ్లాం. అక్కడికొచ్చిన ఓ మలయాళీ మహిళ.. 'ఎంటే మలర్ ఆనో?'(మీరు మా మలర్ కదా?) అని అంది. దీంతో మా ఇద్దరం భావోద్వేగానికి లోనయ్యాం. ఎందుకంటే వారు నన్ను, మా మలర్ అని పిలుస్తున్నారు. ఓ సినిమా చూసి ప్రశంసించొచ్చు. కానీ 'ప్రేమమ్' వచ్చి ఐదేళ్లయిన నా పాత్రను వారిలో ఒకరిగా భావిస్తున్నారు. దీనిని నేను ఎప్పటికీ మర్చిపోలేను" -సాయిపల్లవి, కథానాయిక
'ప్రేమమ్'తో అరంగేట్రం చేసిన సాయిపల్లవి, ఆ తర్వాత దక్షిణాదిలోని పలు భాషల్లో 10 చిత్రాల్లో నటించింది. మారి 2, కాళీ(ఏయ్ పిల్లగాడ), ఫిదా, అథిరన్ తదితర సినిమాలు ఈ జాబితాలో ఉన్నాయి. ప్రస్తుతం ఈమె తెలుగులో రానా సరసన 'విరాటపర్వం'లో నటిస్తోంది. ఇందులో ఆమెది నక్సలైట్ పాత్ర అని సమాచారం. దీనితోపాటే నాగచైతన్య 'లవ్‌స్టోరీ'లోనూ కథానాయికగా కనిపించనుంది.