"మంచి జరిగినా..చెడు జరిగినా అంతా మన మంచికే అనుకోవాలి" అని అంటోంది నటి సాయిపల్లవి. 'ఫిదా'తో తెలుగు తెరకు పరిచయమైన ఈ హీరోయిన్ తొలి చిత్రంతోనే తెలుగమ్మాయి అనిపించేసుకుంది. ఇక 'ఎంసీఏ', 'పడి పడి లేచే మనసు' లాంటి విజయాలతో స్టార్ నాయికగా ఎదిగింది.
"మరి కెరీర్ ఆరంభం నుంచి ఎక్కువగా విజయాలనే రుచి చూసిన మీరు.. పరాజయాల విషయంలో ఎలా ఆలోచిస్తుంటారు?" అని ప్రశ్నిస్తే.. 'జయాపజయాలు ఎదురైనా నామంచికే అనుకుంటా'నని చెప్పింది.
"విజయమైనా.. పరాజయమైనా.. దేని గురించి అతిగా ఆలోచించకపోవడమే ఉత్తమమైన పని. ఎలాంటి ఫలితమెదురైనా దాన్ని సానుకూల దృక్పథంతోనే తీసుకోవాలి. 'ఢీ' షో చేస్తున్నప్పుడు ముగ్గురు దర్శకులు సినిమాల్లో అవకాశాలిచ్చారు. నాకూ చేయాలనిపించేది. కానీ, కొన్ని కారణాల వల్ల చెయ్యలేకపోయా. అప్పుడు బాధగా అనిపించింది. కానీ, ఐదేళ్లకు మళ్లీ 'ప్రేమమ్'తో పరిచయమయ్యా. ఆ సినిమా నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఒకవేళ అంతకు ముందే నేను సినిమా చేసుంటే, అప్పుడు నా కథలు ఎంపిక చేసుకునే విధానం ఎలా ఉండేదో తెలియదు. ఇప్పటిలాగే అప్పుడు నా కెరీర్ ఉండేదా? అని అప్పుడప్పుడు ఆలోచిస్తుంటా. ఎవరేం చెయ్యాలో ముందే రాసి పెట్టి ఉంటుందంటారు కదా. అలా నాకోసం రాసిపెట్టిన స్క్రిప్ట్‌ల్లోనే నేను నటిస్తున్నాని అనుకుంటా. ఫలితం గురించి ఆలోచించను" అని చెప్పింది సాయిపల్లవి.
ప్రస్తుతం సాయి పల్లవి.. రానా సరసన 'విరాటపర్వం'చిత్రంలో నటిస్తోంది. వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తున్నారు. దీంతో పాటు నాగచైతన్యతో కలిసి శేఖర్ కమ్ముల దర్శకత్వంలో'లవ్‌స్టోరీ'చిత్రంలో నటిస్తోంది.