సాయి తేజ్ (Sai Dharam Tej) కథానాయకుడిగా దేవ్ కట్టా (Deva Katta) దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'రిపబ్లిక్' (Republic Movie). ఐశ్వర్య రాజేశ్ కథానాయిక. మణిశర్మ (Mani Sharma) స్వరాలందిస్తున్నారు. ఈ సినిమా తొలి గీతాన్ని 'గాన ఆఫ్ రిపబ్లిక్' పేరుతో దర్శకుడు కొరటాల శివ శనివారం హైదరాబాద్‌లో విడుదల చేశారు.
'ఎయ్ రారో..' అంటూ వినసొంపుగా సాగుతున్న ఈ పాటకు రెహమాన్ సాహిత్యమందించారు. అనురాగ్ కులకర్ణి, హైమత్ మహ్మద్, ఆదిత్య అయ్యంగార్, పృధ్వీచంద్ర సంయుక్తంగా ఆలపించారు. ఈ సందర్భంగా విలేకర్ల సమావేశంలో కొరటాల శివ (Koratala Siva) మాట్లాడారు.
"పాట చాలా బాగుంది. స్వేచ్ఛ గురించి చాలా గొప్పగా చెప్పారు. దేవ్ కట్టా తన సినిమాల్లో సున్నితమైన అంశాల్నీ చాలా ఇంటెన్స్‌గా చెబుతారు. నాకది చాలా నచ్చుతుంది. ఇప్పుడీ 'రిపబ్లిక్'లోనూ అందరినీ ఆలోచింపజేసే విషయాన్ని మరింత బలంగా చెబుతారని ఆశిస్తున్నా. మాస్ పాటలోనూ మెలోడీ రాగాలు పలికించగలరు మణిశర్మ. అది ఆయనకు మాత్రమే సాధ్యమైన విషయం. తేజును నా సోదరుడిలా భావిస్తా. తనకు విజయం వస్తే నాకు వచ్చినంత ఆనంద పడతా. చిత్ర బృందానికి నా శుభాకాంక్షలు. సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నా."
- కొరటాల శివ, దర్శకుడు