రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యువ కథానాయకుడు సాయిధరమ్‌తేజ్ (Saidharamtej health) కోలుకుంటున్నారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా పోస్టు పెట్టి, అభిమానులకు చల్లటి కబురు చెప్పారు.
ట్విట్టర్‌లో థంబ్స్ అప్ సింబల్ చూపిస్తూ ''మీరు నాపై, నా సినిమా 'రిపబ్లిక్'పై చూపించిన ప్రేమ, అభిమానం, ఆదరణకు కృతజ్ఞతగా థ్యాంక్స్ చెప్పడం చాలా చిన్న మాట అవుతుంది. మీ అందరి ముందుకు త్వరలోనే వస్తా'' అని ట్వీట్ చేశారు.
బైక్ అదుపుతప్పి..
సెప్టెంబరు 10న స్పోర్ట్స్ బైక్‌పై ప్రయాణిస్తున్న సాయితేజ్ ప్రమాదవశాత్తూ కిందపడిపోయారు. ఈ ఘటనలో ఆయనకు తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే అపస్మారక స్థితిలో వెళ్లారు. హైదరాబాద్ నగరంలోని కేబుల్ బ్రిడ్జ్- ఐకియా సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. హెల్మెట్ ఉన్నా, ప్రమాద తీవ్రత కారణంగా గాయాలు బలంగా తగిలాయి. వెంటనే స్పందించిన స్థానికులు, పోలీసులు 108 సాయంతో దగ్గర్లోని మెడికవర్ ఆస్పత్రికి, అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం అపోలో ఆస్పత్రికి తరలించారు.