తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'బాలకృష్ణ నటనలో ఓ విశ్వవిద్యాలయం లాంటివారు' - బాలకృష్ణ సినిమా వార్తలు

కెఎస్​ రవికుమార్​ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం రూలర్​. ఈ సినిమాలో సోనాల్​ చౌహాన్​, వేదిక కథానాయికలు. తాజాగా చిత్ర ప్రచారంలో భాగంగా సోమవారం నిర్వహించిన ఓ మీడియా సమావేశంలో బాలయ్య గురించి కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకుంది వేదిక.

ruler movie actress vedhika latest interview
'బాలకృష్ణ నటనలో ఓ విశ్వవిద్యాలయం లాటివారు'

By

Published : Dec 17, 2019, 7:44 AM IST

'విజయదశమి' చిత్రంతో తెలుగు తెరపై అరంగేట్రం చేసిన కథానాయిక వేదిక. 'బాణం'లో నారారోహిత్​ సరసన నటించి తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైంది. కానీ ఆ తర్వాత తెలుగులో అప్పుడప్పుడూ మెరుస్తూ ఇతర భాషల్లో నటిస్తూ వచ్చింది. ఇటీవల 'రూలర్‌'తో మరో అవకాశాన్ని అందుకుంది. బాలకృష్ణ కథానాయకుడిగా, కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. సి.కల్యాణ్‌ నిర్మించారు. చిత్రం ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకొస్తున్న సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించిందీ ముద్దుగుమ్మ.

'దగ్గరగా దూరంగా' తర్వాత తెలుగులో మీరు చేస్తున్న చిత్రమిదే. ఇన్నాళ్లూ తెలుగులో నటించకపోవడానికి కారణమేంటి?

తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో నటిస్తున్నా. ఈ ఏడాది హిందీలోకీ అడుగుపెట్టా. అన్ని భాషల్లో ఒకేసారి సినిమాలు చేయడం కష్టం కదా. అందుకే తమిళ, మలయాళ భాషల్లో వరుసగా సినిమాలు చేసే అవకాశం రావడం వల్ల అక్కడే బిజీ అయిపోయా. ఇక్కడ నాకు మేనేజర్లు కూడా లేరు. అలా కాస్త విరామం వచ్చింది. అయితే తమిళంలో చేసిన 'కాంచన 3' తెలుగులో అనువాదమై విజయాన్ని అందుకుంది. ఆ చిత్రంతో మరోసారి తెలుగు ప్రేక్షకుల్ని పలకరించినట్టైంది. ఇప్పుడు 'రూలర్‌'తో వస్తున్నా.

'రూలర్‌'లో నటించే అవకాశం ఎలా వచ్చింది?

'కాంచన 3' వల్లే దర్శకనిర్మాతల దృష్టి నాపైన పడిందేమో. బాలకృష్ణ సినిమా కోసం పిలుపు రాగానే ఎంతో సంతోషంగా అనిపించింది. ఆయన నిజంగా రూలరే. ఎన్టీఆర్‌ వారసుడిగా తెలుగు సినిమా రంగంపై తనదైన ముద్ర వేశారు. నటనలో ఒక విశ్వవిద్యాలయం లాంటి వారు. ఆయనతో కలిసి నటించడం ఒకెత్తు అనుకుంటే, ఈ కథ మరో ఎత్తు. దాంతో మరో ఆలోచన లేకుండా నటించేందుకు ఒప్పుకున్నా.

ఇందులో మీ పాత్ర ఎలా ఉంటుంది?

మూడు కోణాల్లో సాగే పాత్ర అని చెప్పొచ్చు. గ్లామర్‌తో పాటు సంప్రదాయబద్ధమైన కోణం ఉంటుంది. నటనకి ప్రాధాన్యమున్న సన్నివేశాలు ఉంటాయి. దూకుడు, ఆధిపత్యం ప్రదర్శించే అమ్మాయిగా కనిపిస్తా. గ్లామర్‌తో కూడిన రెండు పాటలుంటాయి. సప్తగిరితో కలిసి చేసే హాస్యం బాగా పండింది. కొన్ని సన్నివేశాల్లో నన్ను నేను చూసుకున్నా.

క్రమశిక్షణ, సమయపాలన విషయంలో పక్కాగా ఉంటారు బాలకృష్ణ. ఆయనతో సెట్‌లో మీకెదురైన అనుభవాలేంటి?

బాలకృష్ణతో కలిసి సెట్‌లో కాసేపు గడిపామంటే ఎన్నో మంచి విషయాలు తెలుసుకోవచ్చు. ఆయన నిబద్ధత, క్రమశిక్షణ నిజంగా స్ఫూర్తిని నింపుతుంటాయి. ప్రతి సినిమాని తొలి సినిమాలా భావిస్తుంటారు. ఆయనకి ఎవరైనా నచ్చారంటే చాలు... వాళ్ల గురించి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. రామోజీ ఫిలింసిటీలో చిత్రీకరణ జరుగుతున్నప్పుడు నా స్టాఫ్‌లో ఒకరికి కాలికి గాయమైంది. వెంటనే అక్కడికి సమీపంలో ఉన్న తన స్నేహితులకి ఫోన్‌ చేసి డాక్టర్‌ అపాయింట్‌మెంట్‌ ఇప్పించి, స్వయంగా పర్యవేక్షించారు. సెట్‌లో అందరినీ ఒకలాగే చూసే పెద్ద మనసు ఆయనది. బాలకృష్ణలో నాకు మరింతగా నచ్చిన విషయం అది.

వేదిక

ఎక్కువగా మీరు సహజమైన పాత్రల్లోనే నటించారు. మాస్‌ మసాలా సినిమా చేయడం ఎలాంటి అనుభవాన్నిచ్చింది?

మాస్‌ మసాలా సినిమాలంటే నాకు ఇష్టం. నటులు ఎప్పటికప్పుడు వైవిధ్యమైన పాత్రలు చేయడం అవసరం. ఎప్పుడూ ఒకే తరహా పాత్రలు చేస్తే బోర్‌ కొడుతుంది. ఇందులో మాస్‌ పాత్రే కాదు. నటనకి కూడా అవకాశం ఉంది. ప్రకాష్‌రాజ్‌, జయసుధ, భూమిక, నాగినీడు, ఝాన్సీ తదితర అనుభవమున్న నటులున్నారు. ఇంత మంది నటులున్నా ఎలాంటి సమస్యలు, అసౌకర్యం ఎదురుకాకుండా సి.కల్యాణ్‌ ఈ చిత్రాన్ని నిర్మించిన విధానం నాకు బాగా నచ్చింది. కె.ఎస్‌. రవికుమార్‌ లాంటి దర్శకుడితో సినిమా అంటే ఏ నటుడికైనా ఒక వరం. నాణ్యత తగ్గకుండా వేగంగా ఈ సినిమాని తీశారు. ఇలాంటి సినిమాల్ని అప్పుడప్పుడు చేస్తుండాలి. ఇకపై తరచూ తెలుగులో నటిస్తాను. కథలు కూడా వస్తున్నాయి.

బాలయ్య మంచి సలహాలు ఇస్తుంటారు..

బాలకృష్ణ సర్‌ చాలా మంచి డ్యాన్సర్‌. పాటంటే ఆయనలో మరింత హుషారొస్తుంది. నాక్కూడా డ్యాన్స్‌ అంటే ఇష్టం. దాంతో ఇందులోని పాటల్ని ఆస్వాదిస్తూ చేశా. సంక్రాంతి నేపథ్యంలో వచ్చే ఒక పాటతో పాటు 'యాలా యాలా...' అనే ఒక మాస్‌ గీతం ఉంటుంది. సంభాషణల విషయంలోనూ, టైమింగ్‌ పరంగా బాలకృష్ణ మంచి సలహాలు ఇస్తుంటారు. నాకు తెలుగు బాగా అర్థమవుతుంది. షాట్‌ మొదలుకావడానికి పది నిమిషాలు ముందు డైలాగులు ఇస్తే చాలు అల్లుకుపోతా. ఈ సినిమా విషయంలో భాష నాకు సమస్య కాలేదు.

ఇది చదవండి: పోర్న్​ స్టార్ అన్నారు.. రాత్రంతా ఏడ్చా: పాయల్

ABOUT THE AUTHOR

...view details