పని విషయంలో ఎంతో నిబద్ధతగా ఉంటారు అగ్ర దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి. సమయం ఎక్కువ తీసుకున్నా పర్వాలేదు కానీ సినిమాలోని ప్రతి సన్నివేశం కూడా ఎంతో పర్‌ఫెక్ట్‌గా ఉండాలనుకుంటారు. అందుకే ఆయన్ని అందరూ జక్కన్న అంటారు. అయితే రాజమౌళిపై తమకున్న కంప్లెయింట్స్ గురించి తెలియజేస్తూ తాజాగా ‘ఆర్‌ఆర్‌ఆర్’ టీమ్ ఓ ప్రత్యేక వీడియోను రూపొందించింది. దర్శకధీరుడు పుట్టినరోజు సందర్భంగా ఆ వీడియోని అభిమానులతో పంచుకుంది.
"జనవరి నెలలో పల్లవి చేస్తాం.. ఆరు నెలల తర్వాత జూన్‌లోనో జులైలోనో చరణం చేస్తాం. డిసెంబర్‌లో లిరిక్ రాయిస్తాడు. ఆ తర్వాత సంవత్సరం మార్చి నెలలో రికార్డింగ్ అంటాడు. నవంబర్‌లో వాయిస్ మిక్సింగ్ ఉంటుంది. ఈలోపు పల్లవి ఏంటో మర్చిపోతాం. మాలోని ఆసక్తి పోతుంది" - కీరవాణి
"రిలాక్స్ అవుదామనుకునే సమయంలోనే కష్టమైన షాట్స్ షూట్ చేస్తానంటారు. మధ్యాహ్నం 12.30 గంటలకు షాట్ పెడతారు. షూట్ చేస్తారు. కానీ ఆయనకి ఏదీ ఒక్కపట్టాన నచ్చదు. అలా ఆ షాట్ కాస్తా దాదాపు రెండు గంటల వరకూ షూట్ చేస్తారు. దాంతో మా ఆకలి చచ్చిపోయింది. ప్రతి సన్నివేశం కూడా పర్‌ఫెక్ట్‌గా రావాలని చెక్కుతూనే ఉంటారు. అందుకే ఆయన జక్కన్న అయ్యారు. ఒక షాట్ కోసం అర్ధరాత్రి ఒకటిన్నరకి షూట్ ప్రారంభించి తెల్లవారుజామున నాలుగున్నరకి పేకప్ చెప్పారు. పర్ఫెక్షన్ కోసం ఆయన మమ్మల్ని చంపేస్తున్నారు" - తారక్
"ఆర్‌ఆర్‌ఆర్’ యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోన్న సమయంలో సెట్‌కి వెళ్లగానే రాజమౌళిని పలకరించి.. ఆయన పక్కన కూర్చున్నా. ఆయన వెంటనే కొన్ని యాక్షన్ సీక్వెన్స్ చెప్పారు. ఆయన చెప్పిన షాట్స్ విని.. ‘బాగుంది సర్ కానీ కొంచెం కష్టం. ఎవరు చేస్తున్నారు?’ అని అడగగా.. ‘నువ్వే’ అన్నారు. అనంతరం ఆయన ఒక ల్యాప్‌టాప్‌లో ముందే చిత్రీకరించిన ఫుటేజ్ చూపించారు. నో చెప్పలేక మేము కూడా ఆయనతో అలా వెళ్లిపోతున్నాం"- రామ్‌చరణ్
వీళ్లతో పాటే కెమెరామన్ సెంథిల్ కుమార్, కో డైరెక్టర్ త్రికోఠితో పాటు మరికొందరు, నవ్వుతూనే ఫిర్యాదులు చేశారు.