RRR Movie: దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్‌ఆర్‌ఆర్' చిత్రంలో ప్రస్తుత స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్‌చరణ్ కలిసి నటించారు. వీరిద్దరూ కలిసి ఇప్పుడు మల్టీస్టారర్ చేయగా.. సీనియర్ ఎన్టీఆర్- చిరంజీవి గతంలోనే 'తిరుగులేని మనిషి' చిత్రంలో నటించారు. శుక్రవారం(మార్చి 25)న 'ఆర్‌ఆర్‌ఆర్' చిత్రం విడుదలవుతున్న సందర్భంగా ఆ చిత్ర విశేషాలు ఓసారి చూద్దాం.
ఆయన రాజా.. ఈయన కిశోర్
సీనియర్ ఎన్టీఆర్, చిరంజీవి కలిసి నటించిన సినిమా 'తిరుగులేని మనిషి'. న్యాయవాది రాజాగా ఎన్టీఆర్, క్లబ్‌ల్లో పాటలు పాడే కిశోర్‌గా చిరంజీవి నటించారు. రతి అగ్నిహోత్రి, జయలక్ష్మి, సత్యనారాయణ, జగ్గయ్య, అల్లు రామలింగయ్య, ముక్కామల, చిడతల అప్పారావు తదితరులు కీలక పాత్రలు పోషించారు. కథేంటంటే.. రాజా తిరుగులేని న్యాయవాది. ప్రాక్టీస్ ప్రారంభంలోనే శభాష్ అనిపించుకుంటాడు. తన సోదరి పద్మ (జయలక్ష్మి) కిశోర్‌ను ప్రాణంగా ప్రేమిస్తుంది. ఈ వ్యవహారం రాజా తండ్రి శశిభూషణ రావు (జగ్గయ్య)కు నచ్చదు. కిశోర్‌కు ఆస్తిపాస్తులు లేని కారణంగా వారి పెళ్లిని తిరస్కరిస్తాడు. దాంతో.. పద్మ ఆత్మహత్యాయత్నం చేసుకుంటుంది. సకాలంలో ఆమెను రక్షించి, తండ్రికి తెలియకుండా కిశోర్‌తో వివాహం చేస్తాడు రాజా.
ఒకానొక సమయంలో.. తన తండ్రికి వజ్రాల అక్రమ రవాణా చేసే వారితో సంబంధముందని తెలుసుకున్న రాజా దిగ్భ్రాంతికి గురవుతాడు. తండ్రి మరణానికి కారకులెవరో తెలుసుకునే ప్రయత్నంలో తన బావమరిది కిశోర్‌కూ ఈ ముఠాతో సంబంధం ఉందని తెలుసుకుని షాక్ అవుతాడు. చిరంజీవి నెగెటివ్ రోల్ పోషించారనే ఈ ట్విస్ట్ సినిమాకే కీలకం. ఆ తర్వాత రాజా మాటలతో కిశోర్ మనసు మార్చుకుంటాడు. ఇద్దరు కలిసి స్మగ్లర్ల గుట్టు రట్టు చేస్తారు. ఈ చిత్రానికి దర్శకత్వం వహించింది ఎవరో కాదు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు. దేవీ వరప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు కేవీ మహదేవన్ సంగీతం అందించారు. ఈ చిత్రం 1981 ఏప్రిల్ 1న విడుదలైంది.