RRR MOVIE PRE RELEASE EVENT: మెగాస్టార్ చిరంజీవి చొరవ తీసుకుని సీఎం జగన్‌తో మాట్లాడటం వల్లే ఏపీలో టికెట్ రేట్లు పెంపు సాధ్యమైందని తెలిపారు దర్శకధీరుడు రాజమౌళి. తమకు గెలిపించడానికి.. చిరు ఎన్నో మాటలు పడాల్సి వచ్చిందని చెప్పారు. ఎన్టీఆర్, రామ్‌చరణ్ కథానాయకులుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ఆర్‌ఆర్‌ఆర్'. మార్చి 25న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే శనివారం చిక్‌బళ్లాపూర్‌లో ప్రీ రిలీజ్ వేడుక జరిగింది. ఈ కార్యక్రమానికి కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్, సీఎం బసవరాజ్ బొమ్మై ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా చిరుపై ప్రశంసల జల్లు కురింపించారు రాజమౌళి.
"మా సినిమా గురించి చెప్పగానే టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చిన తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్ మోహన్‌రెడ్డికి ధన్యవాదాలు. మెగాస్టార్ చిరంజీవి చొరవ తీసుకుని సీఎం జగన్‌తో మాట్లాడటం వల్లే ఏపీలో టికెట్ రేట్లు పెంపు సాధ్యమైంది. ఆయనను చాలా మంది చాలా రకాల మాటలు అన్నారు. మమ్మల్ని నెగ్గించడానికి ఆయన తగ్గి మాటలన్నీ పడ్డారు. చిరంజీవిగారూ.. మీరు నిజమైన మెగాస్టార్. ఆయనకు ఇండస్ట్రీ పెద్ద అనిపించుకోవటం ఇష్టం ఉండదు. ఇండస్ట్రీ బిడ్డగానే ఉంటానని అంటారు. కానీ, ఆయన మా అందరికీ పెద్ద. మేమంతా రుణ పడి ఉంటాం. నా రాముడు(చరణ్), నా భీముడు(ఎన్టీఆర్)లను అడగ్గానే మరో ఆలోచన లేకుండా సినిమా ఒప్పుకొన్నారు. థ్యాంక్స్ అనే మాట చాలా చిన్నది. రామ్‌చరణ్ తేజ్‌కు ఆంజనేయస్వామి పేరు చిరంజీవిగారు ఎందుకు పేరు పెట్టారో నాకు తెలియదు. కానీ, ఆంజనేయస్వామిలా చరణ్ బలమేంటో అతడికి తెలియదు. అలాగే హరికృష్ణగారు ఎందుకు తారక రామ్ అని పెట్టారో తెలియదు. కానీ, నిజంగా తారక రాముడే. తనబలమేంటో రాముడికి తెలుసు. అలాగే తన నటన సామర్థ్యం ఏంటో తెలిసిన వ్యక్తి తారక్. ఒక్క ముక్కలో చెప్పాలంటే 'చరణ్ గొప్ప నటుడు ఆ విషయం అతడికి తెలియదు.. ఎన్టీఆర్ గొప్ప నటుడు ఆ విషయం అతనికి తెలుసు' అలాంటి ఇద్దరు నటులు నా సినిమాలో నటించినందుకు చాలా సంతోషంగా ఉంది"
-రాజమౌళి, దర్శకుడు
వారికి ధన్యవాదాలు..
రామ్‌చరణ్ మాట్లాడుతూ.. "పునీత్ రాజ్‌కుమార్ లేని లోటు శివరాజ్‌కుమార్‌తో తీర్చుకుంటాం. ఆయన ఎక్కడ ఉన్నా మమ్మల్ని ఆశీర్వదిస్తారు. సినిమా వాయిదాల మీద వాయిదా పడినా నాకూ తారక్‌కు నీడలా మీరంతా వెంటే ఉన్నారు. మార్చి 25న మా కష్టం, శ్రమ మీరంతా చూడటానికి వచ్చేస్తోంది. ఇంత పెద్ద సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో 'మీకు ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి' అని అడుగుతున్నారు. నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు. ఇక్కడ ఉన్నందుకు సంతోషంగా ఉంది. ఏపీ, తెలంగాణ తర్వాత కర్ణాటక మాకు పెద్ద మార్కెట్. రాజమౌళి టీమ్‌కు ధన్యవాదాలు" అని చరణ్ తెలిపారు.
'ఆర్ఆర్ఆర్' అంటే అదే..