RRR in Dolby Vision: 'ఆర్ఆర్ఆర్'తో సాంకేతికంగా భారతీయ చిత్ర పరిశ్రమలో మరో ముందడుగు పడింది. కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకుని నేటి దర్శకులు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తున్నారు. ఇప్పుడు 'ఆర్ఆర్ఆర్'తో డాల్బీ విజన్‌ను భారతీయ చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి. ఆ ఫార్మాట్లో విడుదలవుతున్న తొలి భారతీయ చిత్రంగా 'ఆర్ఆర్ఆర్' రికార్డు సృష్టించింది.
ఎన్టీఆర్, రామ్‌చరణ్ కథానాయకులుగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అలా ఈ సినిమాను 2డీ, 3డీలతో పాటు డాల్బీ అట్మాస్, డాల్బీ విజన్ ఫార్మాట్లలోనూ విడుదల చేస్తుండటం గమనార్హం. విదేశాల్లో ఉన్న తెలుగు ప్రేక్షకులు 'డాల్బీ విజన్'లో 'ఆర్ఆర్ఆర్'ను చూసి ఆస్వాదించాల్సిందిగా చిత్ర బృందం చెబుతోంది.
ఇంతకీ ఏంటీ డాల్బీ విజన్/డాల్బీ అట్మాస్?
ఆడియో, వీడియో ఫార్మాట్లను అత్యున్నత ప్రమాణాలతో అందించే అమెరికాకు చెందిన ప్రముఖ సంస్థ డాల్బీ లేబొరేటరీస్ ఈ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం వెండితెరపై మనం చూస్తున్న ప్రతి సన్నివేశాన్నీ డాల్బీ విజన్ కలిగిన తెరపై పదిరెట్లు స్పష్టతతో చూడవచ్చు. ఉదాహరణకు చీకట్లో ఉన్న ఒక వస్తువును చూడటానికి ఒక దీపం వెలిగించామనుకుందాం. ఆ వస్తువు ఆ ఒక్క దీపం వెలుగులో ఒక విధంగా కనపడుతుంది. అదే వస్తువును చూడటానికి వెయ్యి దీపాలు వెలిగిస్తే కనపడే తీరు మరో రకంగా ఉంటుంది. అదే వస్తువును చూడటానికి పదివేల దీపాలను ఉపయోగిస్తే మరింత స్పష్టంగా ఆ వస్తువు ప్రతి అణువునూ చూడొచ్చు. అలాగే సినిమా విషయంలోనూ ఇదే ఫార్ములా అమలవుతుంది. 35 ఎంఎంలో సినిమా చూస్తే వచ్చే అనుభూతికి, 70ఎంఎంలో కలిగే అనుభూతికి తేడా ఉన్నట్లే, డాల్బీ విజన్+డాల్బీ అట్మాస్ ఉన్న థియేటర్లో సినిమా ప్రేక్షకుడిని సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంది.
మన దేశంలో డాల్బీ విజన్ అందుబాటులో ఉందా?
ప్రస్తుతం మన దేశంలో ఐమాక్స్ స్క్రీన్లు మాత్రమే అక్కడక్కడా అందుబాటులో ఉన్నాయి. డాల్బీ విజన్ కలిగిన థియేటర్ మన దేశంలో ఇంకా అందుబాటులోకి రాలేదు. సాధారణ స్క్రీన్‌తో పోలిస్తే డాల్బీ ప్రొజెక్టర్స్ 500 రెట్ల కాంట్రాస్ట్ రేషియోతో పాటు, నాలుగింతల స్పష్టతతో పిక్చర్ నాణ్యత ఉంటుంది. అయితే, చాలా థియేటర్లు డాల్బీ అట్మాస్ సౌండ్ టెక్నాలజీని కలిగి ఉన్నాయి. సాధారణ సౌండ్ సిస్టమ్‌లు కలిగిన థియేటర్లో పోలిస్తే, ఇవి ప్రేక్షకుడికి సరికొత్త అనుభూతిని ఇస్తాయి. దేశవ్యాప్తంగా దాదాపు 500లకు పైగా థియేటర్లు/మల్టీపెక్స్‌లలో డాల్బీ అట్మాస్ సిస్టమ్ ఉంది.