RRR Release Date: యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన చిత్రం 'ఆర్ఆర్ఆర్'. ఇప్పటికే పలుమార్లు విడుదల తేదీని వాయిదా వేసుకున్న ఈ చిత్రం.. తాజాగా కొత్త విడుదల తేదీతో ముందుకొచ్చింది. దేశంలో కరోనా పరిస్థితుల మెరుగుపడితే మార్చి 18న లేదంటే.. ఏప్రిల్ 28న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని ప్రకటించింది.
ఈ ఏడాది జనవరి 7న సినిమాను థియేటర్లలోకి తీసుకురావాలని చిత్రబృందం ప్రయత్నించింది. కానీ కరోనా వల్ల అది సాధ్యపడలేదని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఈ సినిమాపై అమితమైన ప్రేమ చూపిస్తున్న ప్రేక్షకులు, అభిమానులకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపింది.
వాయిదాల మీద వాయిదాలు
2018 చివరిలో అధికారికంగా ప్రకటన వచ్చిన ఈ సినిమాను తొలుత 2020 జులై 30న విడుదల చేస్తామని అన్నారు. ఆ తర్వాత 2021 జనవరి 7వ తేదీకి మార్చారు. ఆ తర్వాత కరోనా ప్రభావం, షూటింగ్ ఆలస్యం కావడం వల్ల అక్టోబరు 13న థియేటర్లలోకి తీసుకొస్తామని అన్నారు. ఇప్పుడు సంక్రాంతి కానుకగా జనవరి 7న రిలీజ్ చేస్తామని చెప్పడం సహా ప్రీ రిలీజ్ ఈవెంట్లు, ప్రచారంతో హోరెత్తించారు. అయితే ఒమిక్రాన్ కేసులు, పలు రాష్ట్రాల్లో ఆంక్షలు, థియేటర్లు మూసివేత.. ఇలా రకరకాల కారణాల వల్ల సినిమాను మరోసారి వాయిదా వేస్తున్నట్లు ట్వీట్ చేశారు.
దాదాపు రూ.450 కోట్లతో నిర్మించిన ఈ భారీ బడ్జెట్ సినిమాలో రామ్‌చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్‌గా నటించారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటించారు. అజయ్ దేవ్‌గణ్, సముద్రఖని, శ్రియ తదితరులు కీలకపాత్రలు పోషించారు. కీరవాణి సంగీతమందించారు. రాజమౌళి దర్శకత్వం వహించారు. డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరించారు.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!