ఆ సినిమా సూపర్ డూపర్ హిట్. ఆ ప్రేమకథ ప్రేక్షకుల్ని ఎంతగా కదిలించిందో.. ఆర్పీ పట్నాయక్ అందించిన సంగీతం కూడా అదే స్థాయిలో హత్తుకుంది. ఆ రోజుల్లో ఎక్కడ విన్నా ఆ చిత్రంలోని గీతాలే. అంతగా ఆర్పీ తన మ్యూజిక్‌తో మ్యాజిక్ చేశారు. ఇదే అవకాశాన్ని దేవీశ్రీ ప్రసాద్ వదులుకున్నారు. ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసా?
అలా ఆర్పీ పట్నాయక్‌ను వరించిన డీఎస్పీ ఛాన్స్ - movie news
టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్.. కెరీర్ ప్రారంభంలో అద్భుత అవకాశాన్ని వదులుకున్నారు. దీంతో ఆ ఛాన్స్ అందుకున్న ఆర్పీ పట్నాయక్ తన సత్తా చూపించారు. ఇంతకీ ఏ సినిమా కోసం ఇలా జరిగిందంటే?
ఉదయ్ కిరణ్, రీమాసేన్ జంటగా తెరకెక్కిన 'మనసంతా నువ్వే'. వి.ఎన్. ఆదిత్య దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలోని ప్రతి పాట శ్రోతల్ని విశేషంగా అలరించింది. ముఖ్యంగా 'తూనీగా తూనీగా', 'చెప్పవే ప్రేమ చెలిమి చిరునామా', 'నీ స్నేహం' ఎప్పటికీ తాజాగానే నిలుస్తాయి.
ముందుగా ఈ సినిమాకు దేవీశ్రీ ప్రసాద్‌ను సంగీత దర్శకుడిగా తీసుకోవాలనుకున్నారు చిత్ర నిర్మాత ఎం.ఎస్.రాజు. 'దేవీ' సినిమాతో డీఎస్పీని సంగీత దర్శకుడిగా వెండితెరకు పరిచయం చేసింది ఆయనే. అలా 'మనసంతా నువ్వే'కూ దేవీనే తీసుకుందామనుకున్నా అనివార్య కారణాల వల్ల ఆయనకు కుదరలేదట. ఎవరైతే బాగుంటుందనే ఆలోచనలో ఉన్నప్పుడు చిత్రబృందానికి ఆర్పీ కనిపించారు. ఒక్కరోజులోనే అన్ని ట్యూన్లు పూర్తి చేసి దర్శక-నిర్మాతల్ని ఆశ్చర్యపరిచారు ఆర్పీ. మరి ఈ ఎవర్‌గ్రీన్ లవ్‌స్టోరీకి డీఎస్పీ సంగీతం ఎలా ఉండేదో కదా!