ఈ సంక్రాంతికి విడుదలయ్యే సినిమాలను థియేటర్లలోనే చూసి తెలుగు సినీపరిశ్రమను ఆదుకోవాలని జూనియర్ ఎన్టీఆర్ ప్రేక్షకులకు విజ్ఞప్తి చేశారు. కొత్త చిత్రాలను, నటీనటులను ప్రోత్సహించే గొప్ప మనసు తెలుగు ప్రేక్షకులకు ఉంటుందన్న తారక్.. దిల్‌రాజు సోదరుడు శిరీష్ తనయుడు ఆశిష్ కథానాయకుడిగా పరిచయమవుతున్న 'రౌడీ బాయ్స్' సినిమా ట్రైలర్‌ను లాంఛనంగా విడుదల చేశారు. 'ప్రేమదేశం' తరహాలో సాగిపోయే 'రౌడీబాయ్స్' చిత్రం తప్పకుండా విజయం సాధిస్తుందని ఎన్టీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా దిల్ రాజు, శిరీష్‌లతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్న ఎన్టీఆర్.. కథానాయకుడిగా తెరంగేట్రం చేస్తున్న అశీష్ నటుడిగా ఎన్నో మంచి చిత్రాలు చేయాలని ఆకాంక్షించారు. అలాగే ప్రజలంతా కొవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ వ్యాక్సిన్ తీసుకోవాలని ఎన్టీఆర్ విజ్ఞప్తి చేశారు.