తెలంగాణ

telangana

ETV Bharat / sitara

Ketika sharma movies: 'ప్రభాస్​తో ఇంటర్వ్యూ అంటే నమ్మలేకపోయా'

'రొమాంటిక్'తో తెలుగు చిత్రసీమకు పరిచయమవుతున్న నటి కేతికశర్మ. సినిమా విడుదల సందర్భంగా తన గురించి, చిత్ర విశేషాలను వెల్లడించింది. ప్రభాస్​తో ఇంటర్వ్యూ అంటే నమ్మలేకపోయాను.

ketika sharma about prabhas
కేతికశర్మ

By

Published : Oct 28, 2021, 7:16 AM IST

"వెండితెరపై కథానాయికగా మెరవాలని చిన్నప్పటి నుంచి కలలు కనేదాన్ని. ఆ కల ఇన్నేళ్లకు తెలుగు సినిమా ద్వారా నెరవేరుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది" అని నటి కేతిక శర్మ చెప్పింది. 'రొమాంటిక్‌' చిత్రంతో చిత్రసీమలోకి అడుగుపెడుతోన్న ఉత్తరాది సోయగం ఆమె. ఆకాశ్ పూరీ హీరోగా నటించిన ఈ సినిమాను అనిల్‌ పాదూరి తెరకెక్కించారు. పూరీ జగన్నాథ్‌, ఛార్మి సంయుక్తంగా నిర్మించారు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ నేపథ్యంలోనే బుధవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించింది కేతిక. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే..

మాది న్యూదిల్లీ. పుట్టి పెరిగిందంతా అక్కడే. చిన్నప్పటి నుంచి సినిమా, సంగీతం, నృత్యం అంటే చాలా ఇష్టం. నటిగా మారాలని పాఠశాల రోజుల్లోనే నిర్ణయించుకున్నా. మా ఇంట్లో అందరూ డాక్టర్లే. నేను ఈ కొత్త ప్రపంచాన్ని ఎంచుకున్నాను. నాకు ‘రొమాంటిక్‌’ అవకాశం ఇన్‌స్టాగ్రామ్ ద్వారా దొరికింది. 'ఇన్‌స్టాలో మిమ్మల్ని చూశాం, ఒకసారి ఆడిషన్‌కు రండి' అని పూరీ కనెక్ట్స్‌ నుంచి ఓరోజు కాల్‌ వచ్చింది. వెంటనే వచ్చి ఆడిషన్‌ ఇచ్చా. కథానాయికగా ఎంపికయ్యా. అలా ఈ సినిమా మొదలైంది. నా తొలి చిత్రమే ఇంత పెద్ద బ్యానర్‌లో చేయడం చాలా ఆనందంగా ఉంది.

మనసుకు నచ్చినట్లు బతికే అమ్మాయిగా..

ఈ చిత్రంలో నేను మౌనిక అనే పాత్రలో కనిపిస్తాను. ఈ క్షణాన్ని ఆస్వాదించాలని అనుకునే అమ్మాయి తను. సమాజంలో కట్టుబాట్ల గురించి ఆలోచించకుండా.. మనసుకు నచ్చినట్లుగా బతికేస్తుంటుంది. తనెవరినైనా ప్రేమిస్తే.. మనస్ఫూర్తిగా అతనితో ప్రేమలో ఉంటుంది. అద్భుతమైన సంభాషణలు ఉన్నాయి. క్లైమాక్స్‌ చాలా అద్భుతంగా ఉంటుంది. రమ్యకృష్ణ, ఆకాశ్​లతో కలిసి నటించడం చాలా సవాల్‌గా అనిపించింది. ద్వితీయార్ధంలో నా పాత్ర చాలా ఎమోషనల్‌గా, ఇంటెన్సిటితో సాగుతుంది. దీన్ని సమర్థంగా చూపించడం కోసం చాలా కష్టపడ్డా.

కేతికశర్మ

ప్రతి సీన్‌ ఓ ట్రీట్‌లా..

ఈ సినిమాతో ఆకాశ్ రూపంలో నాకు మంచి స్నేహితుడు దొరికాడు. రమ్యకృష్ణ మేడమ్‌ రాకతో మా చిత్రం మారిపోయింది. సెట్లో ఆమె నుంచి చాలా నేర్చుకున్నా. ఇది పక్కా పూరీ సినిమాలా ఉంటుంది. ప్రతి సీన్‌ ఓ ట్రీట్‌లా ఉంటుంది. ఇందులో నేను 'నా వల్లే కాదే' అనే పాట పాడాను. తొలి చిత్రంలోనే నాకు పాట పాడే అవకాశం రావడం మరిచిపోలేని అనుభూతి. ప్రస్తుతం తెలుగు నేర్చుకుంటున్నాను.

ఆమె నటన చాలా ఇష్టం..

కథానాయికగా అన్ని రకాల పాత్రలు చేయాలనుంది. సాయిపల్లవి నటన చాలా ఇష్టపడతా. తెరపై ఆమె ఎంతో సహజంగా నటిస్తుంది. నాకు అలాంటి పాత్రలు చేయాలనుంది. ప్రస్తుతం నాగశౌర్యతో 'లక్ష్య' చేస్తున్నాను. వచ్చే నెలలో విడుదల కానుంది. వైష్ణవ్‌ తేజ్‌తో ఓ సినిమా చేస్తున్నాను. చిత్రీకరణ దశలో ఉంది. తొలి సినిమా విడుదల కాకముందే ఇలా వరుస చిత్రాలు చేస్తున్నానంటే.. అది పూరీ జగన్నాథ్‌ సర్‌ వల్లే.

'రొమాంటిక్‌' సినిమా కోసం ప్రభాస్‌ సర్‌ మమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం ఓ మరచిపోలేని జ్ఞాపకం. ఆయన మా టీమ్‌ను పిలిచారు.. మమ్మల్ని ఇంటర్వ్యూ చేయనున్నారు అంటే అసలు నమ్మలేదు. మా ఇంట్లో వాళ్లు దక్షిణాది చిత్రాలు అంతగా చూడరు. కానీ, 'బాహుబలి' అందరికీ తెలుసు. మన ఇండస్ట్రీకి అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చింది ఆ చిత్రమే. అలాంటి ప్రభాస్‌ మమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నారంటే నమ్మలేకపోయాను. ఆయనెంతో మంచి వారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే గొప్ప మనసున్న వ్యక్తి.

ABOUT THE AUTHOR

...view details