బాలీవుడ్‌లో తన నవ్వుతోనే అందరినీ ఆకట్టుకున్న నటుడు మాధవన్. కథానాయకుడు, దర్శకుడు, నిర్మాత, రచయిత, గాయకుడిగా ప్రేక్షకాదరణ పొందారు. ఎక్కువగా ప్రేమకథా చిత్రాల్లో నటించి కుర్రకారు మదిలో స్థానం సంపాదించుకున్నారు. అమ్మాయిల కలల రాకుమారుడిగా నిలిచి రొమాంటిక్ హీరోగా పేరు గాంచారు.
1970 జూన్ 1న పుట్టిన ఆయన అసలు పేరు మాధవన్ బాలాజీ రంగనాథన్. మాధవన్ హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, ఆంగ్లం, మలై వంటి పలు భాషాచిత్రాల్లో నటించారు. తొలిసారిగా బాలీవుడ్‌లో 'ఇస్ రాత్ కీ సుభా నాహిన్' చిత్రంలో ఓ పాట పాడారు. తర్వాత 'ఇన్‌ఫెర్నో' అనే ఆంగ్ల సినిమాలో నటించారు. కన్నడలో 'శాంతి శాంతి శాంతి'లో హీరోగా చేశారు. పరిశ్రమకు కొత్తగా వచ్చిన వెంటనే మూడు భాషల్లో అవకాశాలను అందుకున్న ఏకైక నటుడు మాధవన్ మాత్రమే. హిందీలో '3 ఇడియట్స్'తో ఫిల్మ్‌ఫేర్ అవార్డును సొంతం చేసుకున్నారు. 'తనూ వెడ్స్ మనూ'తో మంచి విజయాన్ని అందుకున్నారు.