అచ్చ తెలుగు అందం... రీతూవర్మ. ఆధునిక ఆలోచనలున్న అమ్మాయికి ప్రతిరూపంలా కనిపిస్తూ పాత్రల్ని రక్తి కట్టిస్తోంది. అందమే కాదు, సహజమైన నటనా ఆమె సొంతం. 'పెళ్లిచూపులు' చిత్రంతో అమ్మాయంటే ఇలా ఉండాలనేలా ఆ పాత్రలో ఒదిగిపోయింది. ఇటీవల విడుదలైన 'కనులు కనులు దోచాయంటే'తో మరో విజయాన్ని అందుకుంది. నాని, శర్వానంద్, నాగశౌర్యలతో కలిసి నటిస్తోంది. ప్రస్తుతం ఇంట్లో గడుపుతున్న రీతూతో 'ఈనాడు సినిమా' ప్రత్యేకంగా ముచ్చటించింది. ఆమె చెప్పిన విషయాలివీ
సెట్స్‌ను మిస్ అవుతున్నారా?
మూడు నెలలైంది, మిస్ అవ్వకుండా ఎలా ఉంటాం. ఎప్పుడెప్పుడు సెట్‌కు వెళదామా? అనిపిస్తోంది. మన చేతుల్లో ఏమీ లేదు కదా. చివరగా 'టక్ జగదీష్' సినిమా చిత్రీకరణలో పాల్గొన్నా. ఆహ్లాదరకమైన వాతావరణం మధ్య చిత్రీకరణ జరిగింది. అక్కడ షూటింగ్ జరుగుతున్నప్పుడే మాకు కరోనా గురించి రోజుకో సమాచారం అందింది. దాంతో చిత్రీకరణను పూర్తి చేసుకుని హైదరాబాద్‌కు వచ్చాం. రాగానే లాక్‌డౌన్‌ను ప్రకటించారు. మొదట్లో అంతగా ఏమీ అనిపించలేదు కానీ... కొన్ని రోజుల తర్వాత ఏంటి పరిస్థితి? ఎప్పుడు బయటికెళతాం? అనిపించింది.
నాలుగు సినిమాల్లో నటిస్తున్నారు కదా. చిత్రీకరణకు సిద్ధం కావాలని ఎవరి దగ్గర్నుంచైనా కబురొచ్చిందా?
నేనూ ఎదురు చూస్తున్నా కానీ, ఎవరి నుంచీ పిలుపు రాలేదు. చిత్రీకరణలకు అనుమతులొచ్చినా... ఇంకొంచెం సమయం తీసుకోవడం మేలని భావిస్తున్నారంతా. అది అవసరం కూడా. ఒకొక్క సెట్‌లో వంద నుంచి రెండు వందల మంది ఉంటాం. అందరూ సురక్షితంగా ఉండటం ముఖ్యం కదా.
ఏయే పుస్తకాలు చదివారు? ఏ సినిమాలు చూశారు?
ఓటీటీల్లో చాలా సిరీస్‌లు చూశా. ఇక సినిమాల విషయానికొస్తే మలయాళం, ఆంగ్ల చిత్రాలు ఎక్కువగా చూశా. ఈమధ్య చూసిన సినిమాల్లో నాకు బాగా నచ్చింది 'జో జో రాబిట్'. హిట్లర్ కాలం నేపథ్యంలో సాగే చిత్రమది. కొన్ని ఆటో బయోగ్రఫీలు చదివా. 'ది ఫైవ్ పీపుల్ యు మీట్ ఇన్ హెవెన్', 'వన్ డే' పుస్తకాలు చదివా.
కొంతకాలం పాటు తమిళంలోనే ఎక్కువగా సినిమాలు చేశారు. కారణమేమిటి?
రెండు సినిమాలే చేశా. 'పెళ్ళిచూపులు' తర్వాత తెలుగులో ఆసక్తికరమైన కథలేవీ దొరకలేదు. అదే సమయంలో తమిళం నుంచి అవకాశాలు వచ్చాయి. కావాలని తమిళంలోకి వెళ్లలేదు. తెలుగుకే నా తొలి ప్రాధాన్యం. నా కెరీర్ ప్రారంభమైందే ఇక్కడ. ఫలానా భాషలోనే నటించాలి, ఫలానా పాత్రలే చేయాలనే ఆలోచన ఎప్పుడూ లేదు. ప్రస్తుతం తెలుగులో నాలుగు సినిమాలు చేస్తున్నా. అందులో శర్వానంద్‌తో చేస్తున్నది ద్విభాషా చిత్రం.