అయితే ఏంటట..! ది గ్రేట్ రాజ్ కపూర్ సుపుత్రుడు రిషీ కపూర్ సినిమాల్లోకి వస్తున్నాడట. ఈ మాట విన్నప్పుడు జనం అన్న మాట 'అయితే ఏంటట?'. బాలనటుడిగా తొలి సినిమాకే జాతీయ అవార్డు జేబులో వేసుకుని జవాబు చెప్పాడు రిషీ. ఈసారి తండ్రి అడుగు జాడల్లో ఏకంగా హీరోగా చేస్తున్నాడట తెలుసా...మళ్లీ అదే ప్రశ్న.. 'అయితే ఏంటట?' ఫస్ట్ సైట్‌లోనే బాక్సాఫీసును లవ్‌లో పడేశాడు రొమాంటిక్ రిషీ. కళ్లు బైర్లు కమ్మే వసూళ్ల సునామీతో సమాధానం చెప్పాడు. లవర్‌బోయ్‌గా పాతికేళ్లు ప్రేక్షకులను ప్రణయ సామ్రాజ్యంలో ఓలలాడించాడు. తెరపై నాయికలను.. కలల్లో అమ్మాయిలను తన పేరు పలవరించేలా చేశాడు. తరం మారాక.. స్వరం మార్చి విభిన్న పాత్రలతో తన ద్వితీయ అంకాన్ని అద్వితీయం చేసుకున్నారు. కానీ క్యాన్సర్ రక్కసితో తన జీవితంలో భారీ కుదుపు. 'అయితే ఏంటట?'..ఈసారి ఈ ప్రశ్న వచ్చింది జనం నుంచి కాదు.. రిషీ మనసులోంచి! వృద్ధాప్యం మీదపడినంత మాత్రానా, క్యాన్సర్ కబళిస్తున్నంత మాత్రానా అంతా అయిపోయినట్టేనా అంటూ మరింత హుషారుగా, అల్లరిగా ప్రతిక్షణాన్ని ఆస్వాదించారు రిషీ. జీవితానికి ఎండ్ కార్డ్ కాకుండా శుభం కార్డు వేసుకున్నారు.
భారతీయ వెండితెరపై ఘన చరిత్ర కలిగిన కపూర్ వంశ వారసుడిగా, నటనలో మేరు పర్వతం లాంటి రాజ్‌కపూర్ కుమారుడిగా సినీ రంగప్రవేశం చేశారు రిషీ. ‘మేరా నామ్ జోకర్’ చిన్నప్పటి రాజ్ కపూర్‌గా కనిపించి తొలి అడుగుల్లోనే మెప్పించారు. రాజ్ కపూర్ ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన ఆ చిత్రం పరాజయం పాలైంది.
పరిచయమే ప్రభంజనం
'మేరా నామ్ జోకర్'తో వచ్చిన నష్టాలు పూడ్చుకోవడానికి రాజ్‌కపూర్ మరో సినిమా తీయాలనుకున్నారు. వేరే హీరోలకు పారితోషికం ఇవ్వడానికి కూడా ఇబ్బందిగా ఉండటం వల్ల రిషీనే కథానాయకుడిగా పరిచయంచేస్తూ అందమైన టీనేజీ ప్రేమకథతో ‘బాబీ’ చిత్రాన్ని తెరకెక్కించారు. డింపుల్ కపాడియాను కథా నాయికగా పరిచయం చేశారు. 1973లో విడుదలైన ఆ చిత్రంలో రిషీ, డింపుల్ మధ్య పండిన కెమిస్ట్రీ, వీనులవిందైన పాటలు ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టాయి. ఆ చిత్రం ఆ దశాబ్దంలోనే అత్యధిక వసూళ్లు సాధించి ఘన విజయాన్నందుకుంది. టీనేజీ ప్రేమకథా చిత్రాలకు ట్రెండ్‌సెట్టర్‌గా నిలిచింది. దీంతో 21 ఏళ్ల వయసులోనే రిషీ పేరు దేశమంతా మార్మోగింది. ఉత్తమ నటుడిగా ఆయనకు ఫిలింఫేర్ దక్కింది. రొమాంటిక్ హీరో ఇమేజ్ సొంతమైంది. తొలి చిత్రంతోనే ఈ స్థాయి విజయాన్ని అందుకున్న అతికొద్ది మంది హీరోల్లో రిషీ ఒకరు.
పాతికేళ్లు.. పూలూ గిటార్లు
'బాబి' ప్రభావం రిషి కెరీర్ మీద ఎంత గట్టిగా ఉందంటే ఆయన తన కెరీర్‌లో సోలో హీరోగా చేసిన దాదాపు అన్ని సినిమాల్లోనూ రొమాంటిక్ హీరోగానే కనిపించారు. చూడగానే ఆకర్షించే ఆయన చూడచక్కని రూపం కూడా అందుకు తోడ్పడింది. దీనికితోడు అప్పటికే అమితాబ్ బచ్చన్ యాక్షన్ హీరోగా ప్రభంజనం సృష్టిస్తుండటంతో అందుకు భిన్నంగా వెళ్లాల్సిన పరిస్థితి. అందుకే అమ్మాయిలకు ఎలాంటి లక్షణాలున్న కుర్రాడు నచ్చుతాడో.. అలాంటి మంచి అబ్బాయి పాత్రల్లోనే రిషి కనిపించేవారు. తెరపై ఆయన చేతిలో నాయికకు ఇవ్వడానికి పూలో, లేదా తన అందాన్ని పొగుడుతూ పాట పాడటానికి గిటారో తప్ప.. యాక్షన్ హీరోలా గన్ను పట్టడమో, బైకులో విలన్లను ఛేజ్ చేయడమో రిషీ పెద్దగా చేయలేదు. రిషి సినిమా అంటే అందమైన లొకేషన్లు, ఆకట్టుకునే ప్రణయ గీతాలు, గాఢమైన ప్రేమ సంభాషణలు తప్పనిసరిగా ఉండేవి. హీరోగా పాతికేళ్ల కెరీర్‌లో లైలా మజ్ను, సర్గమ్, ‘కర్జ్’, ‘ప్రేమ్‌రోగ్’, ‘యష్ ఇష్క్ నహీ ఆసాన్’, ‘సాగర్’, ‘చాందిని’, ‘నాగిన’, ‘బోల్ రాధా బోల్’ లాంటి చిత్రాల్లో ప్రేమను పండించారు రిషీ. అవన్నీ మంచి విజయాలందుకున్నాయి. తన అభినయంతో రొమాంటిక్ హీరో అనే పదానికి అర్థం చెప్పారు రిషీ. రేఖ, శ్రీదేవి, జయప్రద, పర్వీన్ బాబి, జీనత్ అమన్, సంగీతా బిజిలానీ, జూహీ చావ్లా, దివ్యభారతి, టబు.. ఇలా ఎంతోమంది అందమైన నాయికలతో తెరపై రొమాన్స్ చేసిన ఘనత రిషిది.
మల్టీస్టారర్లకూ సై
వేరే హీరోలతో తెరను పంచుకోవడానికీ వెనుకాడలేదు రిషీ. అమర్ అక్బర్ ఆంటోనీ, కభీ కభీ, నసీబ్, ఖేల్ ఖేల్ మే, బదల్తే రిస్తే, దీవానా లాంటి మల్టీస్టారర్ చిత్రాలెన్నో చేశారు. రాజేష్ ఖన్నా, వినోద్ ఖన్నా, అమితాబ్ బచ్చన్, జితేంద్ర, కమల్ హాసన్ లాంటి హీరోలతో ఆయన కలసి నటించి విజయాలందుకున్నారు.
ఆ గళంలో హాస్యం.. ఆవేశం
వృద్ధాప్యం, అనారోగ్యం బాధపెడుతున్నా సామాజిక మాధ్యమాల్లో తన గళాన్ని చురుగ్గా వినిపించేవారు రిషి. బోలెడు హాస్యం, అప్పుడప్పుడు ఆవేశం నిండిన ట్వీట్లతో వార్తల్లో నిలిచేవారు. ఆయన ట్వీట్లకు కూడా అభిమానులు ఉండేవారు. వివాదాస్పదాంశాలపైనా తన అభిప్రాయాలను నిక్కచ్చిగా వెల్లడించేవారు. వినోద్ ఖన్నా మరణించినప్పుడు అంత్యక్రియలకు నటులు రాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వ్యక్తులను గౌరవించడం నేర్చుకోవాలని హితవు పలికారు.
కొత్త భామలకు జై
రిషీ కపూర్ తెరపై లేత కుర్రాడిలా కనిపించేవారు. దీంతో ఆయనకు తగ్గ జోడీగా కనిపించే నాయికలు దొరకడం చాలా కష్టమైంది. అప్పటికే ఉన్న సీనియర్ నాయికలు నచ్చేవారు కాదు. అందుకే కొత్త నాయికలను ఎంచుకోవడంపైనే ఎక్కువగా దృష్టిపెట్టారు. అలాగే ఒకే నాయికతో ఒకటికి మించి సినిమాలు చేసేవారు. రిషీ తన కెరీర్‌లో 49 మంది నాయికలతో కలసి నటిస్తే, వారిలో దాదాపు 19 మంది తను పరిచయం చేసినవారే. తన భార్య నీతూ కపూర్‌తో పాటు డింపుల్ కపాడియా, జయప్రద, రాధిక, రంజిత లాంటి వారెందరో ఆ జాబితాలో ఉన్నారు.
సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ నాటౌట్
సుదీర్ఘ కాలం లవర్‌బోయ్‌గా అలరించిన రిషీ, ఆ తర్వాత పెరిగిన వయసు, కొత్త హీరోల రాక లాంటి వాస్తవాలను అంగీకరించి క్యారెక్టర్ ఆర్టిస్టుగా ద్వితీయ ప్రస్థానం ప్రారంభించారు. నిజానికి సెకండ్ ఇన్నింగ్స్‌లోనే ఆయనలోని విభిన్న నటన వెలుగుచూసింది. అమితాబ్‌కు కుమారుడిగా చేసిన ‘102 నాట్ అవుట్’ ఆయనలోని కొత్త కోణాన్ని చూపించింది. ముదిమి వయసులోనూ పూలరంగడిలా సరదాగా గడిపేస్తున్న తండ్రిపై చిరాకు పడే కొడుకు పాత్రలో గుర్తుండిపోతారు రిషి. ‘కపూర్ అండ్ సన్స్’లో 90 ఏళ్ల తాతయ్యగా కనిపించి ఫిలింఫేర్ అందుకున్నారు. ‘ముల్క్’లో న్యాయం కోసం పోరాడే ముస్లిం వృద్ధుడిగా ఆకట్టుకున్నారు. హృతిక్ రోషన్ చిత్రం ‘అగ్నిపథ్’లోనూ కీలక పాత్రలో నటించారు. ఇలా ఏడు పదులు దగ్గరవుతున్న వయసులోనూ నట తృష్ణను తీర్చుకోవడానికి తపించారు రిషీ.
రొమాంటిక్ హీరో
రిషీకపూర్ తెరపైనే కాదు, నిజ జీవితంలోనూ రొమాంటిక్ అనిపించుకున్నారు. ముఖ్యంగా రిషి- నీతూ సింగ్‌ల ప్రేమ, పెళ్లి... సినిమా కథలకు ఏమాత్రం తీసిపోదు. వీరిద్దరూ కలసి 12 సినిమాలు చేశారు. తొలిసారి కలిసింది ‘జహ్రీలా ఇన్సాన్’ సెట్‌లో. అక్కడే స్నేహం మొదలైంది. తన రహస్యాలన్నిటినీ నీతూతో చెప్పడం మొదలుపెట్టారు రిషీ. క్రమంగా వాళ్ల బంధం బలపడింది. ఒక సినిమా సెట్‌లో ఆమెని బాగా మిస్ అయిన రిషీ ‘యే సిఖ్ని బడీ యాద్ ఆతి హై’ (ఈ సిక్కు అమ్మాయి బాగా గుర్తొస్తోంది) అని రాసి నీతూకు టెలిగ్రామ్ పంపారు. అలా ఇద్దరి మధ్య 1975లో డేటింగ్ మొదలైంది. మన మధ్య డేటింగ్ తప్ప, పెళ్లి ప్రస్తానవ రాకూడదని రిషి చెప్పడంతో నీతూ ఒక దశలో నిరాశ చెందినా...వారి బంధం 1980లో ఎట్టకేలకి పెళ్లి పీటల వరకు వెళ్లింది. పెళ్లి తర్వాత నీతూ ఇల్లు, కుటుంబంపైనే దృష్టి పెట్టారు. అయితే వీరిద్దరి కాపురంలో ఎన్నో ఆటుపోట్లు. అయినా రిషితో నీతూ బంధాన్ని వదులుకోవడానికి ఇష్టపడలేదు. ‘‘అవును... వారు పోరాడటం నేను చూశాను, మా అమ్మ మా అందరినీ కలిపి ఉంచారు’’ అని చెబుతుంటారు ఈ జోడీ ప్రేమకి ప్రతిరూపమైన రణ్‌బీర్ కపూర్.
తొలి ప్రేమ: నీతూ సింగ్‌తో ప్రేమాయణానికి ముందే రిషీ కపూర్ యాస్మిన్ మెహతా అనే ఓ పారసీక యువతితో ప్రేమాయణం కొనసాగించారు. ‘బాబి’ విడుదలయ్యాక, అది ఘన విజయం సాధించడంతో అందులో తనతో కలిసి నటించిన డింపుల్ కపాడియాతో సంబంధం ఉన్నట్టు ఒక పత్రిక రాయడంతో ఆ యువతి తన నుంచి దూరమైందని తన ఆత్మకథలో ధైర్యంగా రాసుకొచ్చారు రిషీ.
తొలి చిత్రంతోనే..
హమ్ తుమ్ ఏక్ కమ్‌రే మే బంద్ హో...- రిషీ కపూర్ తొలి చిత్రం ‘బాబీ’లోని ఈ పాట ఇప్పుడు వినిపించినా మైమరిచిపోయి చెవులు, మనసుని అప్పగించేయాల్సిందే. అలాంటి పాటలు రిషీ కెరీర్‌లో బోలెడన్ని. తొలి చిత్రంతోనే ఆయనపై రొమాంటిక్ హీరో అనే ముద్ర పడటంతో ఆయన ఎక్కువగా అలాంటి పాత్రల్లోనే నటించారు. ‘జెహ్రీలా ఇన్సాన్’ చిత్రంలోని ‘ఓ హాసినీ.. మేరీ హాసినీ’ అనే పాట అప్పట్లో ఉర్రూతలూగించింది. ఎవర్‌గ్రీన్ పాటగా ఇప్పటికీ వినిపిస్తుంటుంది. తన భార్య నీతూసింగ్‌తో కలిసి నటించిన మూడో చిత్రం ‘రఫూ ఛక్కర్’లోని ‘కిసీ పే దిల్ అగర్..’ అంటూ సాగే పెప్పీ గీతం, అందులో రిషీ కనిపించిన విధానం, నీతూతో కెమిస్ట్రీ అదుర్స్ అనిపిస్తుందంతే. ‘ఖేల్ ఖేల్ మే’ చిత్రంలోని ‘ఏక్ మైన్ ఔర్ ఏక్ తు..’, ‘హమ్‌నే తుమ్‌కో దేఖా...’, ‘ఖుల్లం ఖుల్లా ప్యార్ కరేంగా..’ తదితర గీతాలు ఉర్రూతలూగించాయి. రిషీకపూర్ కథానాయకుడిగా నటించిన చిత్రాల్లో ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ది ప్రత్యేకమైన స్థానం. అందులో ‘పర్దా హై పర్దా...’ అంటూ సాగే ఎనిమిది నిమిషాల ఖవ్వాలి పాట, లవర్‌బాయ్‌గా రిషి కపూర్ చేసే సందడి మెప్పిస్తుంది. ‘హమ్ కిసీసే కమ్ నహీ’లోని ‘బచ్‌నా ఏ హసీనో’, ‘సర్గమ్’లోని ‘దఫ్‌లీవాలే దఫ్‌లీ బజా’ (ఇది తెలుగు చిత్రం ‘సిరిసిరి మువ్వ’కి రీమేక్), ‘కర్జ్’ చిత్రంలోని ‘ఓం శాంతి ఓమ్..’, ‘జమానే కో దిఖ్‌నా హై’లోని ‘హోగా తుమ్‌సే ప్యారా కౌన్’, ‘సాగర్’ చిత్రంలోని ‘చెహరా హై యా చాంద్ ఖిలా హై..’, ‘చాందిని’ చిత్రంలోని ‘చాందిని ఓ మేరీ చాందినీ..’ పాటలు రిషీ కపూర్‌ని ఎప్పటికీ మన మధ్యలో ఉండిపోయేలా చేస్తాయి.