క్యాన్సర్‌తో తుదిశ్వాస విడిచిన బాలీవుడ్ ప్రముఖ నటుడు రిషీ కపూర్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. చందన్వాడి స్మశానవాటికలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
రిషీ కపూర్ పార్థివ దేహానికి అంత్యక్రియలకు పూర్తి - బాలీవుడ్ దిగ్గజ నటుడు
16:47 April 30
రిషీ చివరిచూపు కోసం వచ్చిన సినీ ప్రముఖులు
15:52 April 30
మరికాసేపట్లో రిషీ కపూర్ అంత్యక్రియలు
బాలీవుడ్ ప్రముఖు నటుడు రిషీ కపూర్ అంత్యక్రియలు.. ముంబయిలోని చందన్వాడి స్మశానవాటికలో మరికాసేపట్లో జరగనున్నాయి. అందుకోసం అక్కడికి కరీనా కపూర్, ఆలియా భట్, రణ్‌ధీర్ కపూర్, సైఫ్ అలీఖాన్ తదితరులు చేరుకున్నారు. మరికొద్ది మంది చేరుకుంటున్నారు.
12:43 April 30
నట దిగ్గజాలు హఠాత్తుగా దూరమవడం బాధాకరం: బాలకృష్ణ
ఇర్ఫాన్ ఖాన్, రిషి కపూర్ లాంటి నట దిగ్గజాలు హఠాత్తుగా మనకు దూరమవడం చాలా బాధాకరం. భారతీయ సినిమాకు ఇది తీరని లోటు. వారి విశేష ప్రతిభ, చిత్రాల ద్వారా ఎప్పటికీ గుర్తుంటారు. వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి ఆత్మలకు శాంతి కలగాలని ఆ భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నాను -నందమూరి బాలకృష్ణ
12:22 April 30
రిషీ కపూర్ మరణంపై విచారం వ్యక్తం చేశారు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్.
''రిషీ కపూర్ ఆకస్మికంగా మృతి చెందారన్న వార్త విని షాక్‌కు గురయ్యా. ఎప్పుడూ ముఖంపై చిరునవ్వుతో కనిపించే ఆయన ఇక లేరు అని వినడానికి కష్టంగా ఉంది. రిషీ కపూర్ మరణం.. వినోద రంగానికి తీరని నష్టం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి. రిషీ కపూర్ కుటుంబసభ్యులు, ఆత్మీయులకు నా ప్రగాఢ సానుభూతి.''
- రామ్‌నాథ్ కోవింద్, భారత రాష్ట్రపతి
12:09 April 30
''రిషీ కపూర్ ఇక లేరు అన్న వార్త వినడం విచారకరం. ప్రపంచ సినీ పరిశ్రమ మరో అసాధారణ నటుడిని కోల్పోయింది. రణ్‌బీర్ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. రిషీ కపూర్ ఆత్మకు శాంతి చేకూరాలి.''
- మహేష్ బాబు, టాలీవుడ్ సూపర్‌స్టార్
12:00 April 30
రిషీ కపూర్ గొప్ప నటుడే కాకుండా ముక్కుసూటి మనిషి అని అన్నారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే. ఆయన మరణంతో.. రెండు తరాల కళాకారుల మధ్య లింక్ కోల్పోయామన్నారు. ఆయన కుటుంబం భారతీయ సినీ పరిశ్రమకు అసమాన కృషి చేసిందని కొనియాడారు. ఈ మేరకు సీఎం కార్యాలయం ట్వీట్ చేసింది.
11:50 April 30
రిషీ కపూర్ మరణం పట్ల దిగ్భ్రాంతి చెందినట్లు తెలిపారు టాలీవుడ్ పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్. భారతీయ సినీ పరిశ్రమకు తీరని లోటు అని ట్వీట్ చేశారు. ఆయన కుటుంబసభ్యులకు సానుభూతి ప్రకటించారు.
11:44 April 30
రిషీ కపూర్ మరణం తీవ్రంగా బాధించిందన్నారు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, భాజపా నేత దేవేంద్ర ఫడణవీస్.
''బాలీవుడ్ నుంచి మరో విచారకర వార్త. బహుముఖ ప్రజ్ఞాశాలి, నిర్మాత, దర్శకుడు రిషీకపూర్ మనల్ని విడిచివెళ్లారు. నాకు మాటలు రావట్లేదు. ఇది భారతీయ సినీ పరిశ్రమకు తీరని లోటు. ఆయన కుటుంబసభ్యులు, ఆత్మీయులు, అభిమానులకు నా సానుభూతి. ఆయన గొప్ప సినీప్రయాణానికి నా నివాళి. ఓం శాంతి.''
- దేవేంద్ర ఫడణవీస్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి
11:21 April 30
రిషీ కపూర్ బహుముఖ నటశీలి, ప్రజ్ఞాశాలి అని ట్వీట్ చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. ఆయన మరణవార్త విని దిగ్భ్రాంతి చెందినట్లు పేర్కొన్న మోదీ.. రిషీ కుటుంబసభ్యులు, ఆత్మీయులు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.
'' రిషీ కపూర్‌లో ఎనలేని ప్రతిభ దాగిఉంది. ఆయన సినిమాలపై అమితాసక్తి చూపేవారు. భారత పురోగతిపై మక్కువ ప్రదర్శించేవారు. మా మధ్య జరిగిన సంభాషణలను నేనెప్పుడూ గుర్తుచేసుకుంటుంటాను. రిషీ కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. ఓం శాంతి.''
- నరేంద్ర మోదీ, భారత ప్రధాని
11:12 April 30
రిషీ కపూర్ లేరన్న వార్త విని దిగ్భ్రాంతికి గురైనట్లు తెలిపారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్.
'ఎందరో నటులకు రిషీ కపూర్ ప్రేరణనిచ్చారు. తన అత్యుత్తమ నటనతో ప్రేక్షక హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. ఆయన కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. ఓం శాంతి.''
- పీయూష్ గోయల్, కేంద్ర మంత్రి
11:02 April 30
రిషీ కపూర్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్. ఈ సందర్భంగా రిషీ కుటుంబసభ్యులు చేసిన ప్రకటనను ట్విట్టర్లో విడుదల చేశారు.
దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమల్లో ఉన్నందున.. నిబంధనలు అందరూ పాటించాలని కోరారు. రిషీకపూర్ అభిమానులు, ఆత్మీయులకు ఇదో విషాదకరమైన రోజు పేర్కొన్నారు.
10:59 April 30
రిషీ కపూర్ మరణం పట్ల సంతాపం ప్రకటించారు దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. ఆయన కెరీర్ మొత్తం.. తన అద్భుత నటనతో అలరించారని ప్రశంసించారు. ఆయన ఆకస్మిక మరణం విచారం కలిగించిందని తెలిపిన కేజ్రీ.. రిషీ కుటుంబసభ్యులకు సానుభూతి ప్రకటించారు.
10:53 April 30
రిషీ కపూర్ ఇక లేరు అన్న వార్త.. ఎంతో బాధ కలిగిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు మెగాస్టార్ చిరంజీవి.
'' మంచి స్నేహితుడు, గొప్ప కళాకారుడు, కోట్లాది మంది ఆదరాభిమానాల్ని చూరగొన్న నటుడు రిషీ కపూర్ మరణం తీరని లోటు. ప్రియ మిత్రుడు రిషీకపూర్‌కు వీడ్కోలు. మీ ఆత్మకు శాంతి చేకూరాలి.''
- చిరంజీవి, ప్రముఖ నటుడు
10:48 April 30
భారత సినీ పరిశ్రమకు ఇది విషాదకరమైన వారం అని ట్వీట్ చేశారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. తరాలకు అతీతంగా ప్రజల్లో అభిమానాన్ని సంపాదించుకున్న గొప్ప నటుడు రిషీ కపూర్‌ను ఎంతో మిస్సవుతున్నాం అన్నారు. ఆయన కుటుంబసభ్యులు, స్నేహితులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులకు సానుభూతి ప్రకటించారు.
10:44 April 30
రిషీ కపూర్ మరణంపై స్పందించారు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు. సినీ పరిశ్రమ మరో దిగ్గజాన్ని కోల్పోయిందని ట్వీట్ చేశారు. రిషీ.. కుటుంబసభ్యులు, ఆత్మీయులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.
10:40 April 30
ఇవాళ లేవగానే ఇలాంటి వార్త వినడం.. విచారం కలిగిస్తుందని ట్వీట్ చేశారు బాలీవుడ్ నటి శిల్పా షెట్టి. 'కోట్లాది మంది ప్రేమించే గొప్ప నటుడు.. మమ్మల్ని విడిచిపెట్టివెళ్లారు' అని ఆవేదన వ్యక్తం చేశారు.
10:33 April 30
రిషీ కపూర్ మరణవార్త తనను షాక్‌కు గురిచేసిందన్నారు కేంద్ర మంత్రి ప్రకాశ్ జావడేకర్. ఆయన గొప్ప నటుడే కాకుండా.. మంచి మానవతావాది అని గుర్తుచేసుకున్నారు. రిషీ కపూర్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.
10:23 April 30
రిషీ కపూర్ మరణవార్త తనను తీవ్రంగా కలచివేసిందని ట్వీట్ చేశారు భారత క్రికెటర్ శిఖర్ ధావన్. ఆయన కుటుంబసభ్యులకు సానుభూతి ప్రకటించారు.
10:16 April 30
దిగ్గజ నటుడు రిషీ కపూర్ ఆత్మకు శాంతి చేకూరాలని ట్వీట్ చేశారు జాన్ అబ్రహం. ఆయన పాత చిత్రాన్ని పంచుకున్నారు.
10:12 April 30
దిగ్గజ నటుడు రిషీ కపూర్ మృతి.. సినీ పరిశ్రమకు తీరని లోటని ట్వీట్ చేశారు ప్రముఖ దర్శకుడు మధుర్ భండార్కర్. తన అత్యంత అభిమాన నటుల్లో.. రిషీ ఒకరని వ్యాఖ్యానించారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
10:10 April 30
రిషీ మరణంపై పలువురు విచారం..
బాలీవుడ్ నటుడు రిషీ కపూర్ మృతి పట్ల సంతాపం ప్రకటించారు సినీ, రాజకీయ ప్రముఖులు.
రిషీని తన ప్రియమిత్రుడుగా పేర్కొన్న రజనీకాంత్.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
09:50 April 30
రిషీకపూర్ అస్తమయం.. దిగ్భ్రాంతిలో బాలీవుడ్
బాలీవుడ్ నటుడు రిషీకపూర్(67) కన్నుమూశారు. ముంబయిలోని హెచ్‌ఎన్ రిలయన్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కొన్నాళ్లుగా క్యాన్సర్‌తో బాధపడుతున్న రిషీ.. గత రాత్రి ఆస్పత్రిలో చేరారు.
1952 సెప్టెంబరు 4న ముంబయిలో జన్మించారు రిషీకపూర్. ఈయన బాలీవుడ్ దిగ్గజం రాజ్‌కపూర్ రెండో కుమారుడు. ఆర్.కె.ఫిలిమ్స్ బ్యానర్‌పై ఎన్నో చిత్రాలను నిర్మించారు రిషీకపూర్. ఉత్తమ బాలనటుడిగా జాతీయ పురస్కారం కూడా అందుకున్నారు. 1973లో బాబీ చిత్రంతో హీరోగా సినీరంగానికి పరిచయమయ్యారు.
రిషీ కపూర్ హఠాన్మరణంతో బాలీవుడ్ మూగబోయింది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన మృతిపట్ల సంతాపం తెలిపారు.