బాలీవుడ్ కథానాయకుడు సుశాంత్ సింగ్ రాజ్‌పూత్ అనుమానాస్పద మృతి కేసుకు సంబంధించి.. తన కుమార్తె రియా చక్రవర్తికి బెయిలు మంజూరు చేయకపోవడంపై ఇంద్రజిత్ ముఖర్జీ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు కొన్ని వార్తలు వచ్చాయి. అందుకు సంబంధించిన ఆయన ట్వీట్లు చేసిన సందేశాలు వైరల్ అయ్యాయి. అయితే అవన్నీ నకిలీ ఖాతావని తెలుస్తోంది.
చనిపోతా అంటూ ట్వీట్లు..
సుశాంత్ కేసు విచారణ క్రమంలో డ్రగ్స్ కోణం బయటపడ్డ సంగతి తెలిసిందే. దీంతో రంగంలోకి దిగిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) వరుసగా మూడు రోజులు రియాను విచారించారు. మంగళవారం సాయంత్రం ఆమెను అరెస్టు చేశారు. 14 రోజులపాటు ఆమెను కస్టడీలోనే ఉంచనున్నారు. ఈ నేపథ్యంలో ఇంద్రజిత్ పేరిట ట్వీట్లు నెట్టింట చక్కర్లు కొట్టాయి.
"తన కుమార్తెకు అన్యాయం జరిగితే ఏ తండ్రీ తట్టుకోలేడు. నేను చనిపోతాను. ఎటువంటి ఆధారాలు లేకుండా రియాను జైలుకు పంపాలని దేశం (కొందరు ప్రజల్ని ఉద్దేశిస్తూ) చూస్తోంది. రియా బెయిల్‌ను తిరస్కరించారు. తదుపరి బెయిల్ పిటిషన్‌ను సెషన్స్ కోర్టు గురువారం పరిశీలించనుంది" అని వాటిల్లో పేర్కొని ఉంది.
ఆర్మీతోనూ ముడిపెట్టి...!
అనంతరం సుశాంత్‌ను ఉద్దేశించి ఇంద్రజిత్ మాట్లాడినట్లు కొన్ని ట్వీట్లు ఉన్నాయి. "ఈ కేసులో అసౌకర్యాన్ని కలిగించే సత్యం దాగి ఉంది. ఒకవేళ ఎన్‌సీబీ కేసు కోర్టు వరకు వెళితే.. సుశాంత్ ప్రాణాలతో ఉండి ఉంటే.. డ్రగ్స్ తీసుకున్న ప్రధాన నిందితుడిగా, వాటికి డబ్బులు ఇచ్చి కొన్న వ్యక్తిగా ఉండేవాడు. సుశాంత్‌కు న్యాయం జరగాలి అంటూ ఇంత వరకు తెచ్చారు. నాకు కూడా సుశాంత్ బాగా తెలుసు. ఈరోజు పరిస్థితి చూసి అతడు కూడా బాధపడుతుంటాడు. తన ప్రియుడి వల్ల రియా ఇటువంటి సమస్య ఎదుర్కోవాల్సి వస్తోంది. రియా అమాయకురాలు. ఆమెకు న్యాయం జరగాలి. నా ఆర్మీ స్నేహితులారా.. నేనెప్పుడూ మిమ్మల్ని ఎటువంటి సాయం అడగలేదు. కానీ, ఇవాళ ఏమీ చేయలేని ఓ తండ్రిగా మీ సహాయం కోసం ప్రార్థిస్తున్నా" అని ఇంద్రజిత్ పేరిట ట్వీట్లు సోషల్‌మీడియాలో దర్శనమిచ్చాయి. అంతేకాదు వాటిల్లోని ఓ కోట్‌ను బాలీవుడ్ సెలబ్రిటీలు సైతం షేర్ చేశారు.