బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసును సీబీఐకి అప్పగిస్తూ సుప్రీంకోర్టు ఇటీవలే తీర్పిచ్చింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నటి రియా చక్రవర్తికి కేంద్ర దర్యాప్తు బృందం సమన్లు జారీ చేసిందని పలు వార్తలు వచ్చాయి. వీటిని తోసిపుచ్చిన ఆమె లాయర్.. ఇప్పటివరకు ఎలాంటి సమన్లు రియా అందుకోలేదని చెప్పారు.
"డియర్ ఫ్రెండ్స్, రియా చక్రవర్తి, ఆమె కుటుంబానికి సీబీఐ నుంచి ఎలాంటి నోటీసులు రాలేదు. అంతకు ముందు వారు ముంబయి పోలీసులు, ఈడీ విచారణలో మాత్రమే పాల్గొన్నారు. ఈ విషయంలో పుకార్లు సృష్టించొద్దు"
-సతీశ్ మనిషిండే, రియా చక్రవర్తి లాయర్
జూన్ 14న తన సొంత ఫ్లాట్‌లో ఆత్మహత్య చేసుకుని మరణించాడు సుశాంత్. తొలుత నెపోటిజమ్ కారణమని విమర్శలు వచ్చినా, అనంతరం రియానే అతడి మృతికి కారణమంటూ సుశాంత్ తండ్రి పట్నాలో కేసు పెట్టారు. తర్వాత బిహార్ ప్రభుత్వం ఈ కేసును సీబీఐకి సిఫార్స్ చేయడం, కొన్నిరోజులకు వారికి దీనిని అప్పగిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది.
ఈ క్రమంలోనే ముంబయి చేరుకున్న సీబీఐ బృందం.. సుశాంత్ వ్యక్తిగత సిబ్బందిని విచారించింది. గతంలో సుశాంత్ రెండు నెలల పాటు ఉన్న వాటర్‌స్టోన్ రిసార్ట్‌కు వెళ్లి, అక్కడ ఉన్న సమయంలో అతడు ఎలా ప్రవర్తించేవాడో అడిగి తెలుసుకుంది.