సుశాంత్ మృతికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఎదుట హాజరైంది నటి రియా చక్రవర్తి. విచారణ వాయిదా వేయాలని తొలుత రియా విజ్ఞప్తి చేయగా.. అందుకు ఈడీ ఒప్పుకోలేదు. ఆర్థిక లావాదేవీల అంశంపై ప్రధానంగా రియాను విచారించనున్నారు. అలాగే ఈ వ్యవహారంలో అనుమానిత వ్యక్తులందరికీ సమన్లు జారీచేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
"రియా చక్రవర్తి చట్టాన్ని గౌరవించే వ్యక్తి. మనీలాండరింగ్ కేసుకు సంబంధించి విచారణను వాయిదా వేయాలని ఇటీవలే కోరినా.. అందుకు ఈడీ ఒప్పుకోలేదు. అందుకే నిర్ణీత సమయంలోనే అధికారుల ముందు హాజరైంది".
-సతీశ్ మనేషిండే, రియా చక్రవర్తి తరపు న్యాయవాది
సుశాంత్ కేసులో మనీలాండరింగ్ జరిగిందన్న కోణంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఇటీవలే దర్యాప్తు చేపట్టింది. సుశాంత్ ఖాతాల నుంచి రియా చక్రవర్తికి రూ. 15 కోట్లు బదిలీ అయ్యాయనే ఆరోపణల నేపథ్యంలో.. ఈడీ ఆ దిశగా ఆరా తీస్తోంది.
సీబీఐ దర్యాప్తు
సుశాంత్ కేసును విచారించేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) రంగంలోకి దిగింది. సుశాంత్ స్నేహితురాలు రియా చక్రవర్తి సహా ఆమె తల్లిదండ్రులు ఇంద్రజిత్ చక్రవర్తి, సంధ్యా చక్రవర్తి, సోదరుడు షోయిక్ చక్రవర్తితో పాటు శామ్యూల్ మిరంద, శ్రుతి మోదీ అనే మరో ఇద్దరిపై సీబీఐ అధికారులు గురువారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి బిహార్ పోలీసులను సంప్రదించి కేసులోని వివరాలను తెలుసుకున్నారు సీబీఐ అధికారులు.
ఈ కేసులో సీబీఐ దర్యాప్తుపై నటి రియా చక్రవర్తి తరపు న్యాయవాది సతీశ్ మనేషిండే స్పందించారు. మహారాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా సుశాంత్ కేసులో సీబీఐ దర్యాప్తు చేయడం చట్టవిరుద్ధమని అన్నారు. ఈ కేసుకు సంబంధించి బిహార్ పోలీసులు ఇచ్చిన తప్పుడు సమాచారాన్ని.. కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) పరిగణనలోకి తీసుకొని కేసు నమోదు చేసిందని సతీశ్ ఆరోపించారు.