తెలంగాణ

telangana

ETV Bharat / sitara

రియా బెయిల్​ పిటిషన్​పై సెప్టెంబర్​ 10న విచారణ - rhea chakraborty bail application hearing held at mumbai special court

డ్రగ్స్​ సరఫరాదారులతో సంబంధం ఉందనే కారణంగా అరెస్టయిన నటి రియా చక్రవర్తి.. రెండోసారి బెయిల్​ కోసం దరఖాస్తు చేసుకుంది. ఈ పిటిషన్​పై సెప్టెంబర్​ 10న విచారణ జరగనుంది. ఇప్పటికే 14 రోజులు జ్యుడీషియల్​ కస్టడీలో ఉందీ బాలీవుడ్​ నటి.

rhea chakraborty bail application
రియా బెయిల్​ పిటిషన్​పై సెప్టెంబర్​ 10న విచారణ

By

Published : Sep 9, 2020, 3:41 PM IST

బాలీవుడ్ హీరో సుశాంత్‌సింగ్‌ రాజ్‌పూత్‌ మృతి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నటి రియా చక్రవర్తి.. మరోసారి బెయిల్​ కోసం దరఖాస్తు చేసుకుంది.ఆమెతో పాటు తన సోదరుడు షోవిక్​ కూడా బెయిల్​ కోసం పిటిషన్​ దాఖలు చేశాడు. వీటిని సెప్టెంబర్​ 10న ముంబయిలోని ప్రత్యేక న్యాయస్థానం విచారించనుంది. ఈ విషయాన్ని రియా తరఫు న్యాయవాది సతీశ్​ మానేషిండే వెల్లడించారు. తొలిసారి బెయిల్​ పిటిషన్​ను కోర్టు తిరస్కరించింది.

14 రోజుల కస్టడీలో...

నటి రియా చక్రవర్తికి.. మంగళవారం 14 రోజుల పాటు జ్యుడీషియల్‌ కస్టడీ విధించింది న్యాయస్థానం.సుశాంత్‌ అనుమానాస్పద మృతి కేసులో డ్రగ్స్‌ కోణం బయటపడటం వల్ల.. నార్కోటిక్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్సీబీ) రంగంలోకి దిగింది. అనంతరం ఆమెను అదుపులోకి తీసుకొని మూడు రోజుల పాటు విచారించిన అధికారులు.. ఆ తర్వాత అరెస్టు చేశారు. అనంతరం రియాకు వైద్య పరీక్షలతో పాటు కరోనా పరీక్షలు చేయించారు. ఆమెకు కొవిడ్ నెగెటివ్‌ రావడం వల్ల ఎన్సీబీ అధికారులు రియాను కోర్టులో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా హాజరుపరిచారు. విచారించిన న్యాయస్థానం డ్రగ్స్‌ ప్రొక్యూర్‌మెంట్‌ కేసులో రియా చక్రవర్తికి.. సెప్టెంబర్‌ 22 వరకు జ్యుడీషియల్‌ కస్టడీ విధించింది.

ఇవీ ఆరోపణలు..

డ్రగ్స్‌ సేకరణ, వినియోగం, సరఫరా వంటి వ్యవహారాల్లో రియాకు పాత్ర ఉందని ఎన్సీబీ అధికారులు.. కోర్టుకు సమర్పించిన రిమాండ్‌ పత్రంలో పేర్కొన్నట్టు సమాచారం. రియా మాదకద్రవ్యాలను సేకరించేదని పేర్కొన్న అధికారులు.. ఆమె డ్రగ్స్‌ వినియోగించినట్టు మాత్రం రిమాండ్‌ పత్రంలో పేర్కొనలేదని తెలుస్తోంది. సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ అంగీకారం లేకుండానే బలవంతంగా డ్రగ్స్‌ ఇచ్చి మానసికంగా కుంగదీసిందంటూ.. ఇప్పటికే అతడి కుటుంబ సభ్యులు రియాపై ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రియా సోదరుడు షోవిక్‌ చక్రవర్తి అరెస్టయి రిమాండ్‌ ఉన్నాడు.

ABOUT THE AUTHOR

...view details