తన క్లయింట్ రియా చక్రవర్తి అరెస్టుకు సిద్ధంగా ఉందని న్యాయవాది సతీష్ మాన్‌షిండే పేర్కొన్నారు. ఆమె ముందస్తు బెయిల్‌కు కూడా దరఖాస్తు చేసుకోలేదని చెప్పారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అనుమానాస్పద మృతి కేసులో అతని ప్రియురాలు రియా ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో పోలీసులు ఆమెను విచారించగా డ్రగ్స్ కోణం వెలుగులోకి వచ్చింది. దీంతో ఎన్‌సీబీ అధికారులు రంగంలోకి దిగి, ఆదివారం ఉదయం నటికి సమన్లు జారీ చేశారు. విచారణ నిమిత్తం ఇప్పటికే ఆమె ఎన్‌సీబీ కార్యాలయం చేరుకుంది.
'ప్రేమించడం నేరమైతే.. రియా అరెస్టుకు సిద్ధం' - రియా చక్రవర్తి
రియా చక్రవర్తి.. సుశాంత్‌ను ప్రేమించడం నేరమైతే.. ఎటువంటి పరిణామాలనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందని ఆమె తరఫున న్యాయవాది మాన్‌షిండే అన్నారు. ప్రస్తుతం విచారణ నిమిత్తం రియా ఎన్‌సీబీ కార్యాలయానికి చేరుకుంది.
ఈ నేపథ్యంలో ఆమె తరఫు న్యాయవాది సతీష్ మాన్‌షిండే మీడియాతో మాట్లాడారు. "రియా చక్రవర్తి అరెస్టు కావడానికి కూడా సిద్ధంగా ఉంది. ప్రేమించడం నేరమైతే.. ఆమె దాని పరిణామాలను ఎదుర్కోవడానికి సిద్ధమే. ఆమె నిర్దోషి కావడం వల్లే బిహార్ పోలీసులు, సీబీఐ, ఈడీ, ఎన్‌సీబీ కేసుల్లో ఒక్కదానికి కూడా ముందస్తు బెయిల్ తీసుకోలేదు" అని పేర్కొన్నారు.
ఎన్‌సీబీ బృందం ఆదివారం ఉదయం ముంబయిలోని రియా ఇంటికి చేరుకుని, సమన్లు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆమె మధ్యాహ్నం విచారణకు హాజరైంది. ఈ డ్రగ్స్ కేసుకు సంబంధించి రియాతోపాటు మరో 28 మందిని ప్రశ్నించాల్సి ఉందని అధికారులు తెలిపారు.