తెలంగాణ

telangana

By

Published : Dec 27, 2019, 9:01 AM IST

Updated : Dec 27, 2019, 1:43 PM IST

ETV Bharat / sitara

రివ్యూ 2019: రజనీని పట్టించుకోలేదు.. సూర్యనూ చూడలేదు

తెలుగు ప్రేక్షకులు.. సినీ ప్రపంచంలో వీరి పాత్రే వేరు.. హీరోది తెలుగా.. తమిళమా..? కథ మలయాళమా.. కన్నడనా..? డైరెక్టర్ ఎవరు.. మ్యూజిక్​ ఎవరు అందించారు..? అనే తేడా లేకుండా సినిమాను సినిమాలా చూసి ఆస్వాదిస్తారు. కానీ ఈ ఏడాది డబ్బింగ్ చిత్రాలకు తెలుగు రాష్ట్రాల్లో అంతగా ఆదరణ దక్కలేదు.

review 2019
రివ్యూ 2019:

తెలుగు ప్రేక్షకులకు సినిమా అంటే ఎనలేని మమకారం. అది వారి జీవితంలో ఓ భాగంలా మారింది. ప్రతి శుక్రవారం ఓ కొత్త చిత్రం విడుదల కావాల్సిందే. తెలుగు సినిమా కాకున్నా, అనువాదాన్ని అయినా ఆదరిద్దాం అనే పెద్ద మనసు వారికుంది. ఇలాంటి వారు కాబట్టే ఇక్కడ రజనీకాంత్​ లాంటివారు రాజ్యమేలారు.. సూర్య, కార్తి, విక్రమ్​ లాంటి వారు చక్రం తిప్పారు. తెలుగు చిత్ర పరిశ్రమలో అనువాదాలు పోటెత్తడానికి కారణం అదే. ఇప్పుడు హిందీ నుంచీ డబ్బింగ్‌ చిత్రాలు వరుస కడుతున్నాయి. 2019లో మాత్రం అనువాదాల ఆటలు సాగలేదు. సంఖ్యాపరంగా డబ్బింగులు తగ్గాయి. వాటిలో విజయాలు దక్కించుకున్నవీ అరకొరనే.

భారతీయ చిత్రసీమలో టాలీవుడ్​ ప్రభావం

భారతీయ చిత్రసీమలో టాలీవుడ్‌ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంటుంది. బాలీవుడ్‌ తర్వాత అత్యధికంగా ఇక్కడే సినిమాలు విడుదలవుతుంటాయి. మిగిలిన భాషలతో పోలిస్తే, అనువాదాల తాకిడీ ఇక్కడే అధికం. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ దాదాపు 1800 థియేటర్లున్నాయి. వాటిలో ఎప్పుడూ ఏదో ఓ సినిమా ఆడుతుండాలి. లేదంటే థియేటర్ల నిర్వహణ కష్టమైపోతుంది. కొన్నిసార్లు తెలుగు నుంచి వచ్చే సినిమాలు బాగా తగ్గి, థియేటర్లని ఎలా నింపాలో తెలియక అనువాదాలపై ఆధారపడుతుంటారు. రెండుమూడేళ్ల క్రితం ఇలాంటి పరిస్థితే ఎదురైంది. అప్పుడే డబ్బింగు చిత్రాలు తమ ప్రభావాన్ని అధికంగా చూపించాయి. ఈసారి అలాంటి సమస్య లేదు.

అనువాద చిత్రాలు

రికార్డుస్థాయిలో తెలుగు సినిమాలు

2019లో రికార్డు స్థాయిలో తెలుగు సినిమాలు విడుదలయ్యాయి. నెలకు కనీసం 12 నుంచి 15 చిత్రాలు వచ్చాయి. నవంబరు - డిసెంబరులో ఈ జోరు మరింత ఎక్కువైంది. తెలుగు సినిమాలకే సరిపడా థియేటర్లు దొరకడం లేదు. అలాంటిది తమిళ చిత్రాలకు ఎక్కడ చోటిస్తారు. అందుకే.. అనువాదాల స్పీడు బాగా తగ్గిపోయింది. వచ్చిన సినిమాలూ నిలబడలేదు. డబ్బింగుల విజయాలు ఈసారి 5 శాతం కూడా లేదంటే పరిస్థితి ఎలా ఉందో ఇట్టే అర్థం అవుతోంది.

స్టార్​ హీరోలూ బోల్తా

ఎన్నో అంచనాలతో వచ్చిన రజనీకాంత్‌ 'పేటా' తెలుగులో నిలబడలేదు. సూర్య 'ఎన్‌జీకే', 'బందోబస్తు' చిత్రాలు బోల్తా కొట్టాయి. విక్రమ్‌ ఈ ఏడాదీ పరాజయాల పరంపర కొనసాగించాడు. తన నుంచి వచ్చిన 'మిస్టర్‌ కె.కె' ప్రారంభ వసూళ్లనూ అందుకోలేకపోయింది. ఏటా హారర్‌, థ్రిల్లర్‌ అనువాదాలు ఎక్కువగా వస్తుంటాయి. వాటికి నేటివిటీతో పనిలేదు కాబట్టి, తెలుగులోనూ విరివిగా విడుదల చేస్తుంటారు. ఈసారి అవీ భయపెట్టలేదు. దెయ్యాల కథలతో విజయాల్ని అందుకున్న లారెన్స్‌కీ చుక్కెదురైంది. తన 'కాంచన-3' తెలుగు నాట ఆడలేదు. గతేడాది మోహన్‌లాల్‌ నటించిన అనువాద చిత్రాలు విరివిగా వచ్చాయి. అయితే ఈసారి ఆ హవా తగ్గిపోయింది. తన నుంచి వచ్చిన 'లూసిఫర్‌' మలయాళంలో హిట్టైంది. కానీ తెలుగులో ప్రేక్షకుల మన్నన పొందలేకపోయింది. నయనతార చిత్రాలకూ గిరాకీ బాగా తగ్గింది. తను 'అంజలి సీబీఐ'’ అవతారం ఎత్తినా ప్రేక్షకులు పట్టించుకోలేదు.

అనువాద చిత్రాలు

వీళ్లు కాస్త పర్లేదు..

కార్తి మాత్రం కాస్త మెరుగయ్యాడు. ఈ ఏడాది ప్రారంభంలో వచ్చిన 'దేవ్‌' పరాజయం పాలైనా 'ఖైదీ'తో ప్రశంసలు దక్కాయి. మంచి వసూళ్లనీ అందుకుంది. కార్తి గత చిత్రాల రికార్డుల్ని ఈ చిత్రం సవరించింది. ఇటీవల విడుదలైన 'దొంగ' మంచి ప్రయత్నం అనిపించుకుంది. దీపావళికి విజయ్‌ వేసిన 'విజిల్‌' గట్టిగానే మోగింది. ఆ సీజన్‌లో తెలుగు సినిమా లేకపోవడం ఈ సినిమాకు కలిసొచ్చింది. గతంలో విజయ్‌ నుంచి వచ్చిన ఏ చిత్రమూ అందుకుని వసూళ్లని 'విజిల్‌' సాధించింది. విశాల్‌ 'యాక్షన్' మోస్తరు వసూళ్లతో సంతృప్తి పడింది. తెలుగు సినిమాలు బాలీవుడ్‌లో మంచి వసూళ్లని అందుకుంటున్నాయి. దాంతో అక్కడి హీరోలు తెలుగు మార్కెట్‌పై దృష్టి పెట్టారు.

సల్మాన్‌ ఈసారి తెలుగుపై దృష్టి పెట్టాడు. తన 'దబాంగ్‌-3'ని తెలుగులో విడుదల చేసినా మెప్పించలేదు. బాలీవుడ్‌ 'వార్‌' తెలుగులోనూ బాగానే ఆడింది. హాలీవుడ్‌ అనువాదాలు ఈసారి ఎక్కువే వచ్చాయి. వాటిలో 'లయన్‌ కింగ్‌' మాత్రమే మంచి వసూళ్లు దక్కించుకుంది. ప్రధాన పాత్రలకు తెలుగులో పేరొందిన నటులు డబ్బింగ్‌ చెప్పడం వల్ల 'లయన్‌ కింగ్‌' క్రేజ్‌ మరింత పెరిగింది. 'అవెంజర్స్‌: ఎండ్‌గేమ్‌', 'అల్లాదీన్‌', 'ఫ్రోజెన్‌-2'.. ఇలా ఆంగ్ల చిత్రాలు తెలుగు గొంతుకలో వినిపించాయి.

అనువాద చిత్రాలు

అనువాదానికి తగ్గుతున్న ఆదరణ

ఇదివరకు తెలుగు కంటే మిగిలిన భాషల్లోనే కొత్త ఆలోచనలతో కూడిన సినిమాలు వచ్చేవి. అందుకే తెలుగు ప్రేక్షకులు అనువాదాలకు పట్టం కట్టేవారు. ఇప్పుడు వాటితో పోలిస్తే.. మన దగ్గరే నాణ్యమైన చిత్రాలొస్తున్నాయి. అందుకే డబ్బింగ్‌ వైపు మొగ్గు చూపడం లేదు. అమెజాన్‌, నెట్‌ఫ్లిక్స్‌ వచ్చాక థియేటర్లకు వెళ్లే ప్రేక్షకులు క్రమంగా తగ్గుతున్నారు. దానికి తోడు డబ్బింగ్‌ సినిమా అనేసరికి ఆసక్తి చూపించడం లేదు. అందుకే అనువాదాలు పల్టీ కొడుతున్నాయి. కథకథనాల్లో వైవిధ్యం ఉన్న చిత్రాలకే ఎక్కడైనా గిరాకీ. లేదంటే.. పరాజయాల పరంపర ఆగదు.

అనువాద చిత్రాలు

ఇవీ చూడండి.. నా పోరాటాలకు స్ఫూర్తి అతనే..!

Last Updated : Dec 27, 2019, 1:43 PM IST

ABOUT THE AUTHOR

...view details